జైనూర్, వెలుగు : ఆదివాసీలు అభివృద్ధి చెందాలంటే పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పని చేయాలని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు అన్నారు. జైనూర్ మండలం మార్లవాయిలో గురువారం హైమన్ డార్ఫ్, బెట్టి ఎలిజబెత్ దంపతుల 37వ వర్దంతి జరిగింది. డార్ఫ్ దంపతుల సమాధుల వద్ద గిరిజన సాంప్రదాయాల ప్రకారం పూజలు చేసి.. నివాళి అర్పించారు.
ఈసందర్భంగా జరిగిన సభలో బాపురావు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇస్తున్నా.. నాయకుల్లో సమన్వయలోపంతో ఆశించిన మేరకు ఆదివాసీల అభివృద్ధి జరగడం లేదన్నారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలంటూ సుప్రీంకోర్టు లో వేసిన కేసు చివరి దశకు వచ్చిందని చెప్పారు. కర్నాటక, మహారాష్ట్ర తో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కోర్టుకు సానుకూల వివరణ ఇచ్చిందన్నారు. త్వరలోనే తమకు అనుకూలంగా తీర్పు రావచ్చనని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఆగిపోయిన రోడ్డు పనులు చేపట్టేందుకు వీలుగా ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకోవస్తానన్నారు.
ఆసిఫాబాద్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, వెడ్మ బొజ్జు పటేల్, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి, మాజీ ఎంపీ గోడం నగేశ్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు , పద్మ శ్రీ అవార్డు గ్రహీత కనక రాజు ,ఎంపీపీ లు కుమ్ర తిరుమల, భాగ్యలక్ష్మి ,సర్పంచులు కనక ప్రతిభ వేంకటేశ్వర్లు , మడావి భీంరావు పాల్గొన్నారు.