ఆదివాసీలకు అన్యాయం చేస్తే ఆఫీసర్లను జైలుకు పంపిస్తా
ఎంపీ సోయం బాపురావు
కాగజ్ నగర్, వెలుగు: ఆదివాసీ బిడ్డలు అమాయకులని, వాళ్లకేం తెలియదని ఆఫీసర్లు అనుకుంటున్నరేమో.. వాళ్లకు అండగా నేనున్నా. ఆదివాసీల జోలికి వచ్చి తమాషాలు చేస్తే చూస్తూ ఊరుకోను. ఆదివాసీలకు అన్యాయం చేస్తున్న ఆఫీసర్లను జైలుకు పంపిస్తానని ఆదిలాబాద్ఎంపీ సోయం బాపురావు అన్నారు. గురువారం కుమ్రంభీం ఆసిఫాబాద్‌జిల్లా సిర్పూర్ నియోజకవర్గం చింతలమానపల్లి మండలంలో ఆయన పర్యటించారు. పీఎంజీఎస్ వై కింద రవీంద్రనగర్ నుంచి గంగాపూర్వరకు రూ.3 కోట్లతో నిర్మించనున్న రోడ్ల పనులకు భూమి పూజ చేశారు. అనంతరం హెడ్‌క్వార్టర్‌లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఆదివాసీలంటే అమాయకులనే ఆలోచనతో అధికారులు, టీఆర్ఎస్లీడర్లు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారని అన్నారు. 1/17 చట్టానికి తూట్లు పొడిచేలా ఏజెన్సీలో గిరిజనేతరులు, అధికారపార్టీ లీడర్లు భూములు ఆక్రమించి బంగ్లాలు కట్టడం ఆపాలని వార్నింగ్ ఇచ్చారు. చింతలమానపల్లిలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధి, గిరిజనేతరుడు భూమి ఆక్రమించి స్కూల్ బిల్డింగ్కడుతున్నారని, ఈ బిల్డింగ్ కు ఆఫీసర్లు ఎట్లా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. పనులు ఆపకుంటే నెల రోజుల్లో 50 మంది ఆదివాసీలను తీసుకొచ్చి బిల్డింగ్కూలగొడతానని హెచ్చరించారు. ప్రకృతివనం జాగా విషయంలో 11 మంది ఆదివాసీలపై కేసు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పును వెంటనే సరిదిద్దుకోవాలని సూచించారు. కేసీఆర్సర్కారు కేంద్రం డబ్బుతో సోకులు పడుతోందని.. రాష్ట్ర ప్రజల కోసం ఇళ్లు కట్టిస్తానని చెప్పి ప్రధానమంత్రి మోడీ వద్ద రూ.1500 కోట్లు తెచ్చిన కేసీఆర్ ఏ ఊళ్లోనూ ఒక్క ఇల్లు కూడా కట్టియ్యలేదన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు జేబీ.పౌడెల్, సిర్పూర్ నియోజకవర్గ ఇన్చార్జి కొత్తపల్లి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొంగ సత్యనారాయణ, జడ్పీ మాజీ చైర్మన్సిడాం గణపతి, మన్నెవార్ సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పారిపెల్లి పోశం, జిల్లా అధ్యక్షుడు మేడిపల్లి బ్రహ్మయ్య, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కొట్నాక విజయ్ తదితరులు పాల్గొన్నారు.
For More News..