సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి : సోయం బాపురావు

  •   ఘనంగా భారత్ వికసిత్ సంకల్ప్ యాత్ర ప్రారంభం

ఆదిలాబాద్​టౌన్/ఆసిఫాబాద్/జైపూర్, వెలుగు: కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని ఎంపీ సోయం బాపురావు అన్నారు. శనివారం ఆదిలాబాద్ కలెక్టరేట్ ఆవరణలో భారత్ వికసిత్ సంకల్ప్ యాత్ర కార్యక్రమాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్​తో కలిసి ఆయన ప్రారంభించారు. జిల్లాలో 6 ప్రచార వాహనాలతో సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. 

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 13.5 కోట్లకుపైగా నీటి కుళాయి కనెక్షన్లు, 11 కోట్ల మందికి పైగా రైతులకు రూ.2.6 లక్షల కోట్ల ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. ఇల్లు లేని నిరుపేదలకు 4 కోట్ల పక్క ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని, ప్రధానమంత్రి ఉజ్వల యోజన క్రింద 10 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇస్తామన్నారు. అర్హులైన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ కోరారు. డీఆర్​డీఓ కిషన్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
 

యాత్ర ద్వారా ప్రజలకు అవేర్నెస్
 

కేంద్ర ప్రభుత్వం ద్వారా చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై భారత్ వికసిత్ సంకల్ప్ యాత్ర ద్వారా ప్రజలకు అర్థమయ్యేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆసిఫాబాద్ అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శనివారం కలెక్టరేట్ లో డీఆర్డీఓ సురేందర్, డీఎంహెచ్ఓ తుకారాం, డీపీఓ హుస్సేన్​తో కలిసి జిల్లాలో ఈనెల 16 నుంచి జనవరి 26 వరకు నిర్వహించనున్న ఈ యాత్ర ప్రచార వెహికల్​ను ప్రారంభించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్, గరీబ్ కల్యాణ్, అన్న యోజన, దీన్ దయాళ్​ అంత్యోదయ యోజన, ఆవాస్ యోజన, ఉజ్వల యోజన, కిసాన్ సమ్మాన్ నిధి, జీవనజ్యోతి బీమా యోజన వంటి పథకాలపై గ్రామాల్లో ప్రజలకు అర్థమయ్యేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. భీమారం మండలంలోని ఇందారం గ్రామంలో ఈ యాత్రపై అధికారులు ప్రజలకు అవగాహన కలిపించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ మనోజ్ శెట్టి, సీఈఓ నరేందర్, డీపీఓ వెంకటేశ్వర్ రావు, డీఎంఅండ్ హెచ్​ఓ సుబ్బారాయుడు, డిప్యూటీ డీఎంఅండ్ హెచ్​ఓ విజయ నిర్మల, ఎంపీడీఓ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.