- అసెంబ్లీకి బాపూరావు పోటీ చేస్తారన్న ప్రచారానికి తెర
- ఆదిలాబాద్‌లో ఆసక్తికర పరిణామాలు
- బీజేపీ అభ్యర్థుల దరఖాస్తులతో తెరపైకి కొత్త ముఖాలు
అదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా బీజేపీలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బరిలో ఉంటారనుకున్న ఆశావహుల కంటే కొత్త ముఖాలే ఎక్కువగా ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తులు చేసుకోవడం ఒక ఎత్తైతే.. బోథ్ నియోజకవర్గం నుంచి ఎంపీ సోయం బాపూరావు కుమారుడు వెంకటేశ్ అప్లై చేసుకోవడం పార్టీ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఎంపీ సోయం ఈసారి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారంటూ కొంత కాలంగా జరుగుతున్న ప్రచారానికి దీంతో తెర పడినట్లైంది. దరఖాస్తుల స్వీకరణ గడువు ఆదివారంతో ముగియడంతో ఒక్కసారిగా సోయం వెంకటేశ్ తెరపైకి రావడంతో జిల్లా వ్యాప్తంగా నేతలు ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు. వెంకటేశ్ ఎంట్రీ విషయాన్ని ఇన్ని రోజులు గోప్యంగా ఉంచడమే కాకుండా ఎంపీనే అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగింది. ఈ క్రమంలో చివరి రోజు ఎంపీ కొడుకు దరఖాస్తు రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది.
అందరి దృష్టి బోథ్ పైనే..
ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఇప్పుడందరి దృష్టి బోథ్ నియోజకవర్గంపైనే ఉంది. ఇక్కడ బీజేపీ ఎవరికి టికెట్ ఇస్తుందనేది ఉత్కంఠగా మారింది. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు తాను కాకుండా కుమారుడిని రంగంలోకి దించుతుండటంతో ఇప్పటి వరకు దరఖాస్తులు చేసుకున్న ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. సోయం బాపురావే అసెంబ్లీ బరిలో ఉంటారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ తన కుమారుడి రంగంలోకి దింపుతారనే విషయాన్ని మాత్రం బయటకు రానివ్వలేదు. చివరి నిమిషంలో వెంకటేశ్ ను తెరపైకి తీసుకురావడంతో బోథ్ రాజకీయాలు హీటెక్కాయి. ఒక్క బీజేపీలోనే కాకుండా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కూడా ఈ విషయాన్ని జోరుగా చర్చించుకుంటున్నాయి.
బోథ్ తో బాపూరావుకు బలమైన క్యాడర్ ఉంది. తన సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉండటంతో వెంకటేశ్‌కే టికెట్కన్ఫర్మ్ అవుతుందని ఎంపీ భావిస్తున్నారు. అయితే ఇప్పటికే బోథ్ నుంచి గిరిజన మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాకటి దశరథ్, రిటైర్డ్ ఆఫీసర్ గోద్రు, ఆడె మానాజీ, విజయ్ జాదవ్ ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. తన ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ బీజేపీలో చేరిన సాకటి దశరథ్ టికెట్ ఆశిస్తూ రెండేండ్లుగా నియోజకవర్గంలో విస్త్రృతంగా కార్యకలాపాలు చేస్తున్నారు. తాజాగా ఎంపీ కొడుకు తెరపైకి రావడంతో టికెట్ కేటాయింపుపై తీవ్ర ఆసక్తి నెలకొంది.
మారిన సమీకరణాలు
ఆదిలాబాద్ బీజేపీలో ఎన్నికల సమీకరణాలు మారుతున్నాయి. ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి ప్రధాన నేతల జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, జడ్పీ మాజీ చైర్ పర్సన్ సుహాసినీ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తుండగా.. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభంతో కొత్త ముఖాలు తెరపైకి వచ్చాయి. వీరిలో వకుళాభరణం ఆదినాథ్, ప్రతినిధి జ్యోతిరెడ్డి, గంగారెడ్డి, విలాస్, సంతోష్ రెడ్డి, క్రాంతి కుమార్ దరఖాస్తులు చేసుకున్నారు. మొన్నటి వరకు పాయల్ శంకర్, సుహాసిని రెడ్డి వెంట ఉన్న పలువురు లీడర్లు సైతం దరఖాస్తులు చేసుకోవడం గమనార్హం. దీంతో నియోజకవర్గంలోని బీజేపీలో సమీకరణాలు మారనున్నాయి.