బాసూ నువ్వు కేక..: రూ.20వేలతో బైక్ కొని ఊరేగింపు.. రూ. 60వేల ఖర్చు

బాసూ నువ్వు కేక..: రూ.20వేలతో బైక్ కొని ఊరేగింపు.. రూ. 60వేల ఖర్చు

చారాణ కోడికి బారాణ మసాలా అంటే బహుశా ఇదేనేమో. ఎంత ఎర్రి కాకపోతే రూ.20వేల డౌన్‌పేమెంట్‌‌తో బైక్ కొని హంగూ ఆర్భాటాల కోసం రూ. 60వేలు ఖర్చు పెడతారు చెప్పండి. కాకపోతే అతని ధైర్యానికి, ఊరేగింపు వెనుకున్న కారణానికి అతన్ని మెచ్చుకోవాల్సిందే.

మధ్యప్రదేశ్‌లోని శివపురికి చెందిన మురారి లాల్ కుష్వాహ అనే వ్యక్తి చాయ్‌వాలా. ఇతను ఇటీవల రూ.90 వేల విలువైన ఒక మోపెడ్ కొనుగోలు చేశాడు. అందుకోసం 20వేల రూపాయలు డౌన్‌పేమెంట్‌ రుపంలో చెల్లించగా.. మిగిలిన మొత్తం లోన్‌ తీసుకున్నాడు. అయితే కొన్న ఆ బైక్‌ను ఇంటికి తీసుకెళ్లేలోపు రూ. 60వేల ఖర్చు పెట్టాడు. 

బైక్ కొనే ముందు గుర్రపు బండి, డీజే గ్యాంగ్‌తో షోరూమ్‌కి వచ్చిన మురారి లాల్.. మోపెడ్ చేతికొచ్చిన అనంతరం మొదట సాంప్రదాయ పూజలు నిర్వహించాడు. బైక్‌ను పూలమాలతో అలంకరించగా.. అతని స్నేహితులు డీజే పాటలకు స్టెప్పులేశారు. పూజ అనంతరం బైక్ ఊరేగింపు మొదలవ్వగా.. దాదాపు 115 కిలోమీటర్లు సాగింది. ఇక చివరగా వారి ఊరిలోకి ఎంటరవుతున్నామన్న సమయంలో జేసీబీ సహాయంతో బైక్‌ను ఊరేగించాడు. ఇలా షోరూమ్‌ నుండి బైక్ ఇంటికి చేరేసరికి దాదాపు రూ.60 వేలు ఖర్చు చేశాడు.

తన పిల్లల సంతోషం కోసం.. 

ఎందుకీ ఆర్భాటాలని మీడియా వారు ప్రశ్నించగా.. తన పిల్లలను సంతోషంగా ఉంచేందుకు ఇలాంటి వేడుకలు చేస్తానని తెలిపాడు. తన కుమార్తె ప్రియాంక.. కుమారులు రామ్, శ్యామ్‌లకు ఊరేగింపులన్నా.. డీజే అన్నా ఇష్టమని వెల్లడించాడు. అయితే మురారి సంబరాలపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి లేని డీజే కారణంగా చర్యలు చేపట్టారు. మురారి, డీజే ఆపరేటర్‌పై కేసు నమోదుచేశారు. గతంలోనూ అతను ఈ విధంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. రూ.12,500 వేలు పెట్టి ఫోన్ కొనుగోలు చేసి, రూ.25వేలు చెల్లించి వేడుకలు చేశారని గ్రామస్తులు తెలిపారు.