- కమలం శిబిరంలో గ్రూపుల లొల్లి
- సిట్టింగ్ ఎంపీకి చెక్ పెట్టే ప్లాన్
- టికెట్ తనదేనని సోయం ధీమా
ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ ఎంపీ టికెట్ కోసం బీజేపీలో నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు తిరిగి తనకే టికెట్ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తుండగా .. సీనియర్‌నేతలు టికెట్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదిలాబాద్ లోకసభ నియోజకవర్గ పరిధిలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి సానుకూల ఫలితాలు రావడంతో ఇతర పార్టీల నుంచి కూడా ఆశావహులు కమలం కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు. సిట్టింగ్ ఎంపీ బాపురావుకు, జిల్లాకు చెందిన ఇతర సీనియర్ నేతలకు మధ్య కొంతకాలంగా కోల్డ్‌వార్ నడుస్తోంది. దీంతో బాపురావును మారుస్తారా అన్న చర్చ పార్టీవర్గాల్లో జరుగుతోంది.
కమలం లోకి ఆశావహులు
ఆదిలాబాద్ లోకసభ పరిధిలో ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముధోల్, ఖానాపూర్, ఆసిఫాబాద్, సిర్పూర్ సెగ్మెంట్లున్నాయి. ఇందులో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్,నిర్మల్,ముధోల్, సిర్పూర్‌లలో బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచారు. దీంతో ఇక్కడ బీజేపీకి విజయావకాశాలు ఉంటాయని భావిస్తున్న లీడర్లు పోటీకి ముందుకొస్తున్నారు.
ఆదిలాబాద్పార్లమెంట్ ఇన్చార్జి, ఎమ్మెల్యే పాయల్ శంకర్‌కు , ఎంపీ సోయం బాపురావుకు మధ్య కొంతకాలం నుంచి విబేధాలున్నాయి. ఇందులో భాగంగానే పాయల్ శంకర్ బీఆర్ఎస్ నుంచి జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్ బీజేపీలో చేరేలా పావులు కదిపినట్టు చెప్తున్నారు. ఎంపీ టికెట్ ఆశిస్తున్న బీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎంపీతో పాటు మరికొందరు నేతలను కూడా ఆయన పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తోంది.
ఎవరి ధీమా వారిదే
మాజీ ఎంపీ రమేశ్‌రాథోడ్, కొంతకాలం కింద పార్టీలో చేరిన ఆదివాసీ లీడర్ శ్రీలేఖ, బైంసా మార్కెట్ కమిటీ చైర్మెన్ జాదవ్ రాజేష్ బాబు కూడా టికెట్ రేసులో ఉన్నారు. సీనియర్ నాయకుడైన రమేశ్ కూడా టికెట్ పై ధీమాగా ఉండగా.. రాజేశ్‌బాబు ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించారు. గ్రామాల్లో ప్రచార రథాలను తిప్పుతున్నారు.
ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్, పాయల్ శంకర్ మద్దతు తనకే ఉందని ఆయన చెప్పుకుంటున్నారు. ప్రచార రథాలు, ఫ్లెక్సీలతో కొందరు ప్రచారాన్ని ప్రారంభించడంపై ఎంపీ సోయం బాపురావు గట్టిగానే స్పందించారు. ఫ్లెక్సీలు పెడితే, దావత్ లు ఇస్తే సీటు రాదని.. ప్రజల్లో ఉండి సేవ చేస్తేనే టికెట్ దక్కుతుందని కామెంట్ చేస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసివచ్చిన ఆయన టికెట్‌పై భరోసాతో ఉన్నారు.
కాంగ్రెస్ లో పెరిగిన జోష్..
పదేళ్ల తర్వాత ఆదిలాబాద్ కాంగ్రెస్ లో జోష్ కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి.. ప్రభుత్వం ఏర్పడడంతో పార్టీ నేతలు పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టారు. ఆదిలాబాద్ ఎంపీ టికెట్ కోసం 22 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఉమ్మడి జిల్లా ఇన్ చార్జి మంత్రి సీతక్క జిల్లాలో విస్తృతంగా తిరుగుతున్నారు. అధికార కార్యక్రమాలతో పాటు పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నారు. లోకసభ సీటును గెలుచుకునే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది.