
మందుబాబులకు మోహన్ యాదవ్ సర్కార్ షాకిచ్చింది. ఎంత తాగిన కిక్కు ఎక్కని మద్యం అందుబాటులోకి తేనున్నట్లు మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మోహన్ యాదవ్ ప్రభుత్వం 'లో ఆల్కహాలిక్ బేవరేజ్ బార్స్(Low Alcoholic Beverage Bars)' పేరుతో కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చింది. ఇది ఏప్రిల్ 1 నుండి అమల్లోకి రానుంది.
మధ్య ప్రదేశ్‍లో 'లో ఆల్కహాలిక్ బేవరేజ్ బార్స్' అనే కొత్త రకం బార్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ బార్లలో 10 శాతం కంటే తక్కువ ఆల్కహాల్ ఉన్న మద్యాన్ని మాత్రమే అమ్ముతారు. ఎక్కువ శాతం ఆల్కహాలిక్ కంటెంట్ ఉన్న మద్యం నిషేధం. ఇది మందు బాబులను బాధించేదే. మద్యం తాగేదే కిక్కు కోసం.. ఆ కిక్కే లేని మందు ఎవరకి ఉపయోగం అన్నది వారి వాదన.
ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వానికి దాదాపు రూ.450 కోట్ల ఆదాయం నష్టం వాటిల్లుతుందని అంచనా. మధ్యప్రదేశ్‌లో దాదాపు 460 నుండి 470 బార్లు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి.
ఈ ప్రాంతాలలో మద్యం నిషేధం..
2025 ఏప్రిల్ 01 నుండి.. ఉజ్జయిని, ఓంకారేశ్వర్, మహేశ్వర్, మండలేశ్వర్, ఓర్చా, మైహార్, చిత్రకూట్, దాటియా, అమర్‌కంటక్, సల్కాన్‌పూర్ వంటి మతపరమైన కేంద్రాలతో సహా 19 ప్రదేశాలలో మద్యం అమ్మకాలు నిషేధించారు. ఈ నిర్ణయంతో ఆయా ప్రాంతాలలోని 47 మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. అయితే, ఇక్కడో సడలింపు ఉంది. ఇతర ప్రాంతాల నుండి తెచ్చుకొని తాగితే ఏమనరట. ఎటువంటి జరిమానాలు విధించరట.