తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, కేసీఆర్ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాల్సిన సమయం వచ్చిందన్నారు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి వరకు రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నవంబర్ 3న లేదా అంతకు ముందు అయినా అర్హులకు రైతు బంధు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించామని చెప్పారు. దాంతో పాటు దళిత బంధు కూడా ఇవ్వాలని చెప్పానని తెలిపారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం ఎంపీపీ పెండెం సుజాత, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్ తో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఉత్తమ్మాట్లాడారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల వారిని మోసం చేసిందని ఆరోపించారు ఎంపీ ఉత్తమ్ కుమార్రెడ్డి. హుజుర్ నగర్ లో తనకు 50 వేల మెజారిటీ వస్తుందని 6 నెలల క్రితమే చెప్పానన్నారు. డిసెంబర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 75 సీట్లు గెలుస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తరువాత 6 గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వం ఏర్పడిన తరువాత 100 గజాల స్థలంతో పాటు ఇల్లు నిర్మాణానికి అవసరమయ్యే 5 లక్షల రూపాయలు అందిస్తామన్నారు. కార్యకర్తలే తమ కుటుంబ సభ్యులు, వాళ్లే తమ పిల్లలు అని అన్నారు. 24 గంటల పాటు ప్రజల కోసమే తాము పాటుపడుతున్నామని చెప్పారు. తాను ఏ ఒక్కరోజు ప్రజలను ఇబ్బంది పెట్టలేదన్నారు. బై బై కేసీఆర్, బై బై సైదిరెడ్డి.. మీరందరూ నన్ను ఆశీర్వదించండి అంటూ పిలుపునిచ్చారు. హుజుర్ నగర్ ప్రజల నమ్మకాన్ని తాను వమ్ము చేయనని చెప్పారు.