కోదాడ/హుజూర్ నగర్, వెలుగు : కాంగ్రెస్ పార్టీని వీడుతున్నామంటూ తమపై సొంత పార్టీ నేతలే ట్రోల్ చేయిస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ ఉత్తమ్ కుమర్ రెడ్డి ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. సొంత పార్టీ నేతలే ఇదంతా చేయిస్తున్నారని, రెండు రోజుల్లో వారి వివరాలను బయటపెడ్తానని వెల్లడించారు. ఎయిర్ పోర్ట్ లో తన భార్య, మాజీ ఎమ్మెల్యే పద్మావతిని బీఆర్ఎస్ మహిళా నాయకులు యాదృచ్ఛికంగా కలిస్తే తాము పార్టీ మారుతున్నామని ప్రచారం షురూ చేశారని ఆయన ఖండించారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతితో కలిసి ఉత్తమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడలో కాంగ్రెస్ అభ్యర్థి 50 వేల మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు.
మెజార్టీ ఒక్క ఓటు తగ్గినా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. కోదాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే శాండ్, ల్యాండ్, మైన్స్, వైన్స్ దందాలతో పాటు మట్టి దందాకు కూడా తెరలేపారని ఆరోపించారు. తమ హయాంలోనే నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందన్నారు. హూజూర్ నగర్ లో జరిగిన సమావేశంలోనూ ఆయన మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.