రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయే అని, 70 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 స్థానాలకు, 12 కాంగ్రెస్ పార్టీవేనని చెప్పారు. ఏఐసీసీ టీపీసీసీ ఎన్నికల కమిటీల ఆమోదంతో తాను హుజూర్ నగర్ నుంచి పోటీ చేస్తున్నానని ఆయన తెలిపారు. కోదాడ, హుజుర్ నగర్ నియోజకవర్గంలో తాను 50 వేల మెజారిటీతో గెలుస్తానని ఉత్తమ్ కుమార్ వెల్లడించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంపై, సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందని.. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు ఓడిస్తారని ఉత్తమ్ కుమార్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. నిరుద్యోగ భృతి 2018సంవత్సరంలో ప్రకటించినా ఇప్పటికి దాన్ని అమలుకు నోచుకోలేదని మండిపడ్డారు. దళిత, గిరిజనులకు మూడెకరాల భూమిని ఇస్తామని సీఎం కేసీఆర్ మోసం చేశాడని అన్నారు.
తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో ముదిరాజులకు ఒక్క సీటు కూడా కేటాయించలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. మాదిగలకు మంత్రివర్గంలో స్థానం లేదని.. మైనారిటీలకి 12శాతం రిజర్వేషన్ కల్పించకుండా గొడవలు పెడుతున్నారని వ్యాఖ్యానించారు. కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు కేవలం డబ్బు సంపాదించాలనే ఆలోచన తప్ప.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న లీడర్లపై పోలీసులను అడ్డం పెట్టుకొని.. కేసులు పెట్టి పార్టీలోకి రావాలని హింసిస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. వైన్ షాపుల దగ్గర దందాలు చేస్తూ.. ప్రతి పనిలో కమిషన్లు తీసుకుంటున్నారని, ఎమ్మెల్యేల అరాచకాలు పెరిగాయని విమర్శించారు.
తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారని.. ఎన్నికల సమయంలో సరైన బుద్ధి చెప్తారని స్పష్టం చేశారు.