రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్దే అధికారం : ఎంపీ ఉత్తమ్

సూర్యాపేట జిల్లా : వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 75 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తంచేశారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. త్వరలో ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. వచ్చే ఏడాది మే నెలలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుస్తుందని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని చెప్పారు. ఈ ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పూర్తి మద్దతు ప్రకటించిందని చెప్పారు. మహిళా బిల్లు పాస్ కావడం సోనియాగాంధీ కల అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కేవలం బీజేపీ ప్రభుత్వం కోసమే అన్నారు. హుజుర్ నగర్ నియోజకవర్గంలోని మెల్లచెర్వు మండలానికి చెందిన బీఆర్ఎస్, వైస్సార్ టీపీ పార్టీల నుండి పలువురు కార్యకర్తలు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. 

దళితులకు, గిరిజనులకు మూడు ఎకరాల భూమిని ఇవ్వలేదు గానీ స్థానిక ఎమ్మెల్యే 300 ఎకరాలు కబ్జా చేశారని ఆరోపించారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేయలేదన్నారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారిలో ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ముదిరాజ్ కూడా టికెట్ ఇవ్వలేదన్నారు. కేసీఆర్ సర్కార్ మ్యానిఫెస్టోలో పేర్కొన్న పథకాలు అమలు చేయడం బదులు.. మద్యం మీద ట్యాక్స్ వసూలు చేస్తోందన్నారు. రాబోయే ఎన్నికల్లో తాను 50 వేల మెజారిటీతో గెలుస్తానంటూ చెప్పారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. మెల్లచెర్వు మండలంలో అనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే అభివృద్ధి పనులు చేసిందన్నారు. కాంగ్రెస్ నాయకులను భయబ్రాంతులకు గురి చేసి, ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. భూముల మాఫియా, లిక్కర్, ఇసుక మాఫియా హుజుర్ నగర్ నియోజకవర్గంలో చెలరేగిపోతున్నాయన్నారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రెండు ఒక్కటే అన్నారు.