అవినీతికి బీఆర్ఎస్ పరాకాష్ట : ఎంపీ ఉత్తమ్ 

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ ను గెలిపించి.. జిల్లాను కాంగ్రెస్ ఖిల్లా చేస్తామని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా నల్గొండ జిల్లా కాంగ్రెస్ కు కంచుకోట అని అన్నారు. భారతదేశంలోనే ఒక్క జిల్లాలోనే ఇద్దరు ఎంపీలు గెలిపించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని చెప్పారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ హయంలో తెచ్చిన సాగునీటి ప్రాజెక్టులు తప్ప కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్తగా తెచ్చిందేమీ లేవన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల దందా అంతా అక్రమ వ్యాపారాలపైనే ఉందన్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్స్ వందల్లో ఇస్తే 12లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. 

అవినీతికి బీఆర్ఎస్ పరాకాష్ట అని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం పేపర్స్ లీకేజీలతో నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీల్లోనూ భారీగా ఖాళీలు ఉన్నాయని చెప్పారు. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదన్నారు. ఎస్ఎల్ బీసీ సొరంగం తొమ్మిదేళ్లలో తొమ్మిది ఇంచులు కూడా ముందుకెళ్లలేదని వ్యాఖ్యానించారు. ఉదయ సముద్రం ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక సమయంలో ఎన్నో లిఫ్ట్ లకు శంకుస్థాపన చేశారని, వాటికి ఇప్పటి వరకు అతీగతీ లేదన్నారు. 

ఎండాకాలం ఇంకా మొదలు కాకముందే నల్గొండలో నీటి ఎద్దడి ఉందని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథకు ఖర్చు చేసిన రూ.40 వేల కోట్లు ఎక్కడికి వెళ్లాయని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు అక్రమంగా ఇసుక సరఫరా, మైనింగ్ చేస్తున్నా.. సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్య మరింత రెట్టింపు అయ్యిందన్నారు. చదువుకున్న నిరుద్యోగులు 40 లక్షల మంది వరకు ఉన్నారని, ఇది బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యం కాదా..? అని ప్రశ్నించారు. పేపర్ లీకేజీ కంటే మరో దుర్మార్గపు చర్య ఇంకొకటి లేదన్నారు. ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలన్నారు. కాంగ్రెస్ ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఇప్పటి వరకు రిక్రూట్ మెంట్ చేయలేదన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.