ఓటుకు డబ్బులు అలవాటు చేసిందే కేసీఆర్ : ఎంపీ ఉత్తమ్

సూర్యాపేట జిల్లా : సీపీఐ పార్టీకి గొప్ప రాజకీయ చరిత్ర ఉందని, స్వాతంత్రం తర్వాత సీపీఐ పార్టీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిందన్నారు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పుడున్న సమకాలీన పరిస్థితులలో కూడా కార్మికులకు, కూలీలకు, వ్యవసాయదారులకు సీపీఐ అండగా నిలబడుతోందని చెప్పారు. ఇప్పటికీ సీపీఐ సిద్ధాంతాలు, విలువలతో కూడుకుని ఉందన్నారు. హుజూర్ నగర్ పట్టణంలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ పార్టీ సీనియర్ నాయకులతో కలిసి ఉత్తమ్ మాట్లాడారు.

ఓటుకి డబ్బులు అలవాటు చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు ఎంపీ ఉత్తమ్. 2014 తర్వాత రాజకీయాలను కేసీఆర్ భ్రష్టు పట్టించారని.. దీనివల్ల ప్రజాస్వామ్యం దెబ్బతిన్నదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సునామీ వీస్తోందని చెప్పారు. కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాలలో 50 వేల మెజార్టీ వస్తుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 80 సీట్లను కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఉచిత విద్యుత్తుకు శ్రీకారం చుట్టిన పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు. ఎవరెన్నీ మాయమాటలు చెప్పినా.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవుతుందన్నారు.