ఛత్తీస్‌గఢ్ పరిపాలనను చూసి సీఎం కేసీఆర్ సిగ్గుపడాలని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ బడ్జెట్ లో సగమే ఛత్తీస్‌గఢ్ బడ్జెట్ అని చెప్పారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఒక్కో నిరుద్యోగికి భృతి కింద రూ.2500 ప్రతి నెలా ఇస్తున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి నిరుద్యోగికి రూ.3 వేలు ఇస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ డిక్లరేషన్ లోని ఇచ్చిన అన్ని హామీలు తప్పకుండా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని వర్గాలను మోసం చేశాయని, ఈ రెండు పార్టీలను బొందపెట్టాలని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆది శంకరాచార్యుల తర్వాత కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచిన ఏకైక నేత రాహుల్ గాంధీ మాత్రమే అని తెలిపారు. ముస్లింలందరూ కాంగ్రెస్ ను ఆదరించాలని, తాము మీ వెంట ఉంటామని చెప్పారు.
కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియంలో కాంగ్రెస్ సభ నిర్వహించింది. ఈ సభకు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బగేల్ హాజరయ్యారు. ఇటు రాష్ట్రం నుంచి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు సీతక్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, గడ్డం వినోద్, కొండా సురేఖ, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, అంజన్ కుమార్ యాదవ్, కోదండరెడ్డి, అద్దంకి దయాకర్ తో పాటు ఇతర నేతలు హాజరయ్యారు. మరోవైపు కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్, కొప్పుల రాజు, మాణిక్ రావు ఠాక్రే, సురేశ్ షెట్కార్ పాల్గొన్నారు. ఈ సభలో ములుగు ఎమ్మెల్యే సీతక్క పాట పడి కాంగ్రెస్ శ్రేణులను అలరించారు.
ఓబీసీ కులగణన చేయడం లేదు : కొప్పుల రాజు
పేద ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు కాంగ్రెస్ పునరంకితమైందని ఏఐసీసీ ఎస్సీ, ఎస్టీ సెల్ కో- ఆర్డినేటర్ కొప్పుల రాజు చెప్పారు. బడుగు, బలహీన వర్గాలకు 50 శాతం పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ రాయ్ పూర్ సభలో నిర్ణయం తీసుకుందని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం ఓబీసీ కులగణన చేయడం లేదని మండిపడ్డారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే ప్రతిపాదనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రైవేటుసెక్టారులోనూ నిరుద్యోగులకు రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించామన్నారు.