ఖమ్మంలో సూపర్​ ఫాస్ట్​ రైళ్లకు హాల్టింగ్​ ఇవ్వాలి : వద్దిరాజు రవిచంద్ర 

  • కేంద్ర రైల్వే మంత్రిని కోరిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర 

ఖమ్మం, వెలుగు : ఖమ్మంలో పలు సూపర్​ఫాస్ట్​ రైళ్లకు హాల్టింగ్​ ఇవ్వాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్​ను కోరారు. ఈ మేరకు పార్లమెంట్ ఆవరణలోని రైల్వే మంత్రి కార్యాలయంలో గురువారం వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ..  ఖమ్మం చుట్టుపక్కల ఉన్న వందలాది గ్రానైట్ పరిశ్రమలు, క్వారీల్లో తమిళనాడు , బిహార్​కు చెందిన వేలాది మంది కార్మికులు పని చేస్తున్నారని..

వీరంతా సొంత రాష్ట్రాలకు వరంగల్​ లేదా విజయవాడ మీదుగా వెళ్లాల్సి వస్తోందని మంత్రికి నివేదించారు. సమస్యను గుర్తించి తమిళనాడు, గయా మాస్ సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఖమ్మంలో హాల్టింగ్ ఇవ్వాలని కోరారు. తక్షణమే నివేదిక తెప్పించుకుని తగిన చర్యలు తీసుకుంటానని రైల్వే మంత్రి హామీ ఇచ్చారు.

ఎల్పీజీ డీలర్ల సమస్యలపై కేంద్ర మంత్రికి వినతి

తెలుగు రాష్ట్రాలలోని ఎల్పీజీ సిలిండర్ డిస్ట్రిబ్యూటర్లు తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో కేంద్ర పెట్రోలియం, సహజ వనరుల శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పూరిని కలిసారు. గడిచిన నాలుగేళ్లుగా ఎల్పీజీ డీలర్లకు డొమెస్టిక్ సిలిండర్ సరఫరాపై ఇచ్చే కమీషన్ పెంచడం లేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ వంట గ్యాస్ సిలిండర్ ధరలు రూ. 200 లు తగ్గించడంతో వేలాది సిలిండర్లు స్టాక్ పెట్టుకున్న డీలర్లు నష్టపోయారని వారికి తగ్గిన ధర ప్రకారం రీ ఎంబర్స్ చేయాలని కోరారు. సమస్యలపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో ఎల్పీజీ డీలర్ల సంఘం తెలంగాణ అధ్యక్షుడు కె. జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడు సుమన శేఖర్, మాజీ అధ్యక్షుడు మేళ్లచెర్వు పాల్గొన్నారు.