న్యూఢిల్లీ, వెలుగు: కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పనులు త్వరగా ప్రారంభించాలని కేంద్రాన్ని బీఆర్ఎస్ పార్లమెంటరీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర కోరారు. సోమవారం ఢిల్లీలో ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, జిల్లా నేతలతో కలిసి ఆయన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ 50 ఏండ్ల కల అని తెలిపారు. దీనిపై తక్షణమే స్పష్టమైన ప్రకటన చేయాలని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కోరినట్టు చెప్పారు.
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కాజీపేటలో కాకుండా పంజాబ్, బెంగాల్, మహారాష్ట్రలో కోచ్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసి తెలంగాణకు అన్యాయం చేసిందని విమర్శించారు. కాగా, తమ విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని వద్ది రాజు మీడియాకు వెల్లడించారు.
మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ధర్నా
కేంద్రం త్వరలో ఏర్పాటు చేయబోయే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు 60 శాతం ఉద్యోగాలివ్వాలని కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. సోమవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వినయ్ భాస్కర్ నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడారు. తెలంగాణ విభజన హామీలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, వరంగల్ కు కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని చెప్పి వ్యాగన్ ఫ్యాక్టరీతో సరిపెట్టాలని చూశారని తెలిపారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై ఈ పార్లమెంట్ సమావేశాల్లో సమగ్ర ప్రకటన చేయాలని కోరారు.