మేఘాకు పాలు పోసి పెంచిన పాపం మీదే: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

మేఘాకు పాలు పోసి పెంచిన  పాపం మీదే: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
  • కేటీఆర్​పై ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫైర్
  • ఆ కంపెనీని బీఆర్ఎస్ హయాంలో ఎందుకు బ్లాక్ లిస్టులో పెట్టలేదు? 
  • అందుకు ఎంత ముట్టిందో చెప్పాలని డిమాండ్ 

హైదరాబాద్, వెలుగు:మేఘా కంపెనీకి పాలు పోసి పెంచిన పాపం బీఆర్ఎస్ దేనని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఆ కంపెనీ నిర్వాకాలను మీడియా బయటపెట్టినా బీఆర్ఎస్ హయాంలో పదేండ్ల పాటు ఎందుకు బ్లాక్ లిస్టులో పెట్టలేదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్​ను ప్రశ్నించారు. ‘సుంకిశాల ఘటనలో కాంట్రాక్టర్​పై చర్యలేవి?’ అనే హెడ్​లైన్​తో బుధవారం వెలుగు పేపర్ లో వచ్చిన స్టోరీపై కేటీఆర్ స్పందిస్తూ.. మేఘా కంపెనీని వెంటనే బ్లాక్​లిస్టులో పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్​చేశారు. దీనిపై కేటీఆర్ కు కౌంటర్ ఇస్తూ ఎంపీ వంశీకృష్ణ ట్విట్టర్ లో పోస్టు పెట్టారు.

‘‘మేఘా కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నాం. కానీ వాళ్ల ప్రభుత్వ హయాంలోనే మేఘా కంపెనీకి సుంకిశాల ప్రాజెక్టు కట్టబెట్టిన విషయం కేటీఆర్ గుర్తు చేసి ఉంటే బాగుండేది. పగిలిపోయిన మిషన్ భగీరథ పైపుల నుంచి కుంగిపోయిన కాళేశ్వరం దాకా.. మేఘా కంపెనీకి పాలు పోసి పెంచిన పాపం బీఆర్ఎస్ దే. ఈ పాపంలో ఆయన ఇంటికి ఎన్ని మూటలు చేరాయో కూడా కేటీఆర్ లెక్క చెబితే ప్రజలకు వాస్తవాలు తెలిసేవి.

గత పదేండ్లలో మేఘా కంపెనీ నిర్వాకాలు ఎన్నో బయటపడినా, మీడియా కథనాలు వచ్చినా ఎందుకు బ్లాక్ లిస్టులో పెట్టలేదో కేటీఆర్ చెప్పాలి. ఆ కంపెనీని కాపాడినందుకు, ఇంకిన్ని కాంట్రాక్టులు ఇచ్చినందుకు ఎంత ముట్టిందో కేటీఆర్ మరో ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించాలి” అని ఎంపీ వంశీకృష్ణ డిమాండ్ చేశారు. వాస్తవాలు రాస్తున్నందుకు ఇదే వెలుగు పత్రికను గతంలో బ్యాన్ చేస్తున్నట్టు ప్రకటించిన విషయాన్ని కేటీఆర్ మరిచిపోయారని ఎద్దేవా చేశారు.