బెల్లంపల్లిలో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల సౌకర్యార్థం ఆసుపత్రి దగ్గర బస్టాప్ ను ప్రారంభించి ఆర్టీసీ బస్సుకు జెండా ఊపి ప్రారంభించారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఈ క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఎంపీ వంశీకృష్ణ. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రజల సౌకర్యార్థం బస్ స్టాప్ ఏర్పాటు చేయడం సంతోషకరంగా ఉందని అన్నారు. బస్ స్టాప్ ఏర్పాటుకు సహకరించిన అధికారులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.
ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొట్టమొదటిగా ప్రవేశపెట్టిందే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యమని.. అందులో భాగంగా ప్రజలకు అవసరమైన చోట బస్టాపులు ఏర్పాటుకు సైతం ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు ఎంపీ వంశీకృష్ణ.
ఈ కార్యక్రమంలో ఎంపీ వంశీకృష్ణతో పాటు ఎమ్మెల్యే గడ్డం వినోద్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కూడా పాల్గొన్నారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఆసుపత్రికి వచ్చే ప్రజల సౌకర్యార్థం బస్ స్టాప్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని అన్నారు. బస్ స్టాప్ ఏర్పాటుతో సుదూర ప్రాంతాల నుండి వచ్చే ప్రజలకు, ఆసుపత్రి సిబ్బందికి ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. బస్ స్టాప్ ఏర్పాటుకు సహకరించిన జిల్లా కలెక్టర్ కు, ఆర్టీసీ అధికారులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ప్రజల శ్రేయస్సు కోసం భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడతామని అన్నారు ఎమ్మెల్యే వినోద్.