రామగుండానికి ఎయిర్​పోర్ట్ రాకుండా కుట్ర : ఎంపీ వంశీ కృష్ణ

రామగుండానికి ఎయిర్​పోర్ట్ రాకుండా కుట్ర : ఎంపీ వంశీ కృష్ణ
  • ఫీజిబులిటీ రిపోర్టు పేరుతో అడ్డుకునే ప్రయత్నం
  • సీఎంతో కలిసి కేంద్రంపై ఒత్తిడి పెంచుతా:ఎంపీ వంశీ కృష్ణ

న్యూఢిల్లీ, వెలుగు: రామగుండంలోని బసంత్ నగర్ లో ఎయిర్ పోర్ట్ రాకుండా రాజకీయ కుట్ర జరుగుతున్నదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆరోపించారు. టెక్నికల్ ఫీజిబులిటి రిపోర్ట్ పేరుతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇది పూర్తిగా రాజకీయ అజెండాతో సాగుతుందే తప్ప.. అభివృద్ధితో ముడిపడిలేదన్నారు. సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో సహచర కాంగ్రెస్ ఎంపీలతో కలిసి ఆయన మాట్లాడారు. బసంత్ నగర్ లో ఎయిర్ పోర్ట్ నిర్మించాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేసినట్లు గుర్తు చేశారు. ఈ సందర్భంగా బసంత్ నగర్ తో పాటు తెలంగాణ లో కొత్తగా నాలుగు ఎయిర్ పోర్ట్ లు నిర్మిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు చెప్పారు. 

అయితే ఇందుకు భిన్నంగా రామగుండంలో ఎయిర్ పోర్ట్ నిర్మాణం సాధ్యంకాదని తనకు కేంద్ర విమానయాన శాఖ నుంచి లేఖ వచ్చిందని వివరించారు. టెక్నికల్ ఫీజిబులిటి రిపోర్ట్ (టీఎఫ్ఆర్) లో హై హిల్స్ ఉన్నాయని చెబుతూ.. ఎయిర్ పోర్ట్ ను కట్టలేమని లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు. ఇది పూర్తిగా పొలిటికల్ కుట్ర అని ఆరోపించారు. గతంలో ఈ ఎయిర్ పోర్ట్ ను బిర్లా, ఇతర సంస్థలు వినియోగించినట్లు చెప్పారు. ఇది బెస్ట్ ఎయిర్ పోర్ట్ అని అధికారులు కూడా బాహాటంగానే చెబుతున్న విషయాన్ని గుర్తు చేశారు. 

ఖమ్మం పరిధిలోని కొత్త గూడెం ఎయిర్ పోర్ట్ ను కూడా టీఎఫ్ఆర్ పేరుతో పక్కన పెట్టే కుట్ర జరుగుతున్నదని వెల్లడించారు. ఈ ఎయిర్ పోర్ట్ విషయంలోనూ రామగుండానికి సంబంధించిన లేఖనే కాపీ, పేస్ట్ కొట్టారన్నారు. బసంత్ నగర్ ఎయిర్ పోర్ట్ కోసం మరోసారి సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిని కలిసి ఒత్తిడి పెంచుతామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రామగుండానికి ఎయిర్ పోర్ట్ తెచ్చేలా ప్రయత్నిస్తున్నానని నియోజక వర్గ ప్రజలకు హామీ ఇచ్చారు.

సీఎం ఆలోచనలు పిల్లల భవిష్యత్​కు బాటలు

విద్యారంగంలో సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలు పిల్లల బంగారు భవిష్యత్ కు బాటలు వేసేలా ఉన్నాయని ఎంపీ వంశీకృష్ణ అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటులో ప్రభుత్వం రిలీజ్ చేసిన జీవో 56.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూసీ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపబోతున్నట్లు చెప్పారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని చెన్నూరు, మంథని, బెల్లంపల్లికి ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను మంజూరు చేసినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 56 గురుకులాలు అందుబాటులోకి రానున్నట్లు వివరించారు.