వందేభారత్ రైలును మంచిర్యాలలో ఆపండి

వందేభారత్ రైలును మంచిర్యాలలో ఆపండి
  • సౌత్ సెంట్రల్ రైల్వే జీఎంను కోరిన  ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
  • పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్​లో రైల్వే సమస్యలను పరిష్కరించాలని వినతి

సికింద్రాబాద్, వెలుగు:  సికింద్రాబాద్–నాగపూర్​మధ్య కొత్తగా ప్రారంభించిన వందేభారత్​రైలుకు మంచిర్యాలలో స్టాప్ ఏర్పాటు చేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ను పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​వెంకటస్వామి కోరారు.పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో రైల్వే అభివృద్ధి కార్యక్రమాలపై  దృష్టి పెట్టాలని, రైల్వే సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు.

మంగళవారం సికింద్రాబాద్ రైల్​నిలయంలో సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్​కుమార్ జైన్, ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ నాగ్యతో వంశీకృష్ణ, వివేక్ భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో వంశీకృష్ణ మాట్లాడారు. పెద్దపల్లి ప్రాంతంలో కొత్త రైల్వే స్టేషన్లను ఏర్పాటు చేయాలని, కరోనా సమయంలో కొన్ని స్టేషన్లలో రద్దు చేసిన రైల్వే స్టాప్​లను పునరుద్ధరించాలని జీఎంను కోరినట్టు ఆయన తెలిపారు. 

రవాణా సౌకర్యాలతోనే అభివృద్ధి.. 

బీఆర్ఎస్​హయాంలో పెద్దపల్లి సెగ్మెంట్ ను పట్టించుకోలేదని ఎంపీ వంశీకృష్ణ మండిపడ్డారు. మంచిర్యాల, పెద్దపల్లి నిర్లక్ష్యానికి గురయ్యాయని అన్నారు. ‘‘రవాణా సదుపాయాలు బాగుంటేనే ఏ ప్రాంతమైనా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. ప్యాసింజర్​కనెక్టివిటీ పెరిగితేనే వ్యాపార లావాదేవీలు పెరుగుతాయి. తద్వారా ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందడంతో పాటు మంచి సదుపాయాలు కూడా అందుబాటులోకి వస్తాయి. 

పెద్దపల్లి ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కొత్త రైల్వే స్టాప్​లు, కొత్త రైల్వే ట్రాక్​లు ఏర్పాటు చేయాలని జీఎంను కోరాం. సికింద్రాబాద్-–నాగపూర్​మధ్య కొత్తగా ప్రారంభించిన వందేభారత్​రైలుతో పాటు కేరళ ఎక్స్​ప్రెస్​రైలుకు కూడా మంచిర్యాలలో స్టాప్​ ఏర్పాటు చేయాలని కోరాం. రామగిరి ఎక్స్​ప్రెస్​కు మందమర్రిలో స్టాప్​ఇవ్వాలని విజ్ఞప్తి చేశాం. తిరుపతి, ఇతర పుణ్య క్షేత్రాలు వెళ్లే భక్తులు అధికంగా ఉన్న నేపథ్యంలో బెల్లంపల్లి నుంచి తిరుపతికి కొత్త ఎక్స్​ప్రెస్​రైలు ప్రారంభించాలని విన్నవించాం. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాలకు రైల్వే కనెక్టివిటీ ఉండేలా చర్యలు చేపట్టాలని కోరాం” అని వెల్లడించారు.