
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం క్యాతనపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జిని ప్రారంభించారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు. బ్రిడ్జి ప్రారంభోత్సవానికి మందమర్రి పట్టణ ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చారు.ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు ఎంపీ వంశీకృష్ణ. బీఆర్ఎస్ పదేళ్ల హయాంలో బ్రిడ్జిని పట్టించుకోలేదని అన్నారు. ROB కోసం ఎమ్మెల్యే వివేక్ కృషి చేశారని అన్నారు.
క్యాతనపల్లిలో రైల్వే ఓవర్ బ్రిడ్జి లేకపోవడం వల్ల ఎన్నో ప్రమాదాలు జరిగాయని.. వివేక్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి బ్రిడ్జి కోసం ఎంతగానో పోరాడారని అన్నారు. ఢిల్లీలో కాకా వెంకటస్వామిని అందరు గుర్తు చేసుకుంటారని.. తెలంగాణ కోసం వివేక్ తో పాటు 11 మంది ఎంపీలు కొట్లాడారని అన్నారు వంశీకృష్ణ.
ఎన్నో కష్టాలు పడి తెలంగాణ తెచుకున్నామని.. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. సింగరేణి రిటైర్డ్ కార్మికుల సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించానని.. రిటైర్డ్ కార్మికులకు రూ. 10వేల పెన్షన్ కోసం పోరాడతానని అన్నారు ఎంపీ వంశీకృష్ణ. ప్రజాసమస్యల పరిష్కారం కోసం ముందుంటానని అన్నారు.