ఆలయ అభివృద్ధికి ఎంపీ ఫండ్స్ కేటాయిస్తా: ఎంపీ వంశీకృష్ణ

ఆలయ అభివృద్ధికి ఎంపీ ఫండ్స్ కేటాయిస్తా: ఎంపీ వంశీకృష్ణ
  • గూడెం శ్రీసత్యనారాయణ స్వామిని దర్శించుకోవడం అదృష్టం: ఎంపీ వంశీకృష్ణ
  • చెన్నూరులో ఎమ్మెల్యే వివేక్ ఇంట్లో పార్టీ కార్యకర్తలతో భేటీ

కోల్​బెల్ట్/లక్సెట్టిపేట, వెలుగు: రాష్ట్రంలో మరో అన్నవరంగా పిలుస్తున్న గూడెం సత్యనారాయణ స్వామి ఆలయానికి ఎంపీ నిధులు కేటాయించి అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. ఆదివారం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం- సత్యనారాయణ స్వామి ఆలయాన్ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సందర్శించారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఎంపీకి ఆలయ అర్చకులు, ఈవో సంఘటల శ్రీనివాస్ ఘన స్వాగతం పలికి, శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. మొదటిసారి గూడెం శ్రీసత్యనారాయణ స్వామి వారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. 

1964లో స్వయంభూగా వెలిసిన స్వామివారి ఆలయానికి లక్షల మంది భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకోవడం గొప్ప విషయమని పేర్కొన్నారు. కోరిన కోరికలు తీర్చే దేవుడిగా స్వామివారు విరాజిల్లుతున్నారని చెప్పారు. స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అనంతరం లక్సెట్టిపేటలో ఊట్కూర్ చౌరస్తా వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వంశీకృష్ణ పూల మాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులతో కలిసి అక్కడే టీ తాగారు. తర్వాత మంచిర్యాల హైటెక్ సీటీలోని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి నివాసంలో కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలతో ఎంపీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు వివిధ సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకవచ్చారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఎంపీ వెంట పీసీసీ జనరల్ సెక్రటరీ పిన్నింటి రాఘునాథ్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు బండి సదానందం యాదవ్, తడబోయిన శ్రీకాంత్, ఆలయ మాజీ డైరెక్టర్ తోట రాజయ్య, దమ్ము సునీల్, శాతరాజి రవి, బిల్లకూరి బాపు, మల్లేశ్, దుర్గయ్య పాల్గొన్నారు.