మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన 21 ఏళ్ల యువతి ఫారిన్ ట్రిప్ కోసం కిడ్నాప్ డ్రామా ఆడి తన తండ్రి నుంచి ఏకంగా రూ.30 లక్షలు డిమాండ్ చేసింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు గట్టు రట్టు చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మధ్యప్రదేశ్ కు చెందిన కావ్య ధాకడ్ అనే యువతి ఫారిన్ ట్రిప్ కోసం తన ఫ్రెండ్స్ తో కలిసి ప్లాన్ చేసింది. అయితే ఫారిన్ వెళ్లేందుకు డబ్బులు లేకపోవడంతో కిడ్నాప్ డ్రామా షురూ చేసింది.
తనని కిడ్నాప్ చేసినట్లుగా ఫ్రెండ్స్ తో ఫోన్ చేయించి రూ. 30 లక్షలు ఇస్తేనే విడిచిపెడతామని తన కుటుంబ సభ్యులను బెదిరించింది. దీంతో వెంటనే భయపడిపోయిన ఆ యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి అసలు కిడ్నాప్ కాలేదని తేల్చేశారు. మరి ఎందుకిలా చేసిందని విచారించగా అసలు విషయాలు బయటపడ్డాయి.
కావ్య ధాకడ్ మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు 400 కిలోమీటర్ల దూరంలో తన స్నేహితులతో కలిసి ఉంటుందని పోలీసులు తెలిపారు. ఫారిన్ ట్రిప్ వెళ్లెందుకు ఈ కిడ్నాప్ డ్రామా ఆడినట్లుగా యవతి విచారణలో ఒప్పుకుంది. ఇదిలా ఉంటే గతేడాది ఆగస్టు 3వ తేదీన కావ్య ధాకడ్ ను ఆమె తల్లిదండ్రులు ఓ ఇన్ స్టిట్యూట్‌లో కోచింగ్ కోసం జాయిన్ చేశారు. కానీ జాయిన్ చేసిన రెండో రోజు అంటే ఆగస్టు 5వ తేదీన ఆమె ఇన్ స్టిట్యూషన్, హాస్టల్ నుంచి వెకెట్ చేసి వచ్చేసింది.
దాదాపు 6 నుంచి 7 నెలలు యువతి ఎటువంటి కోచింగ్ సెంటర్ లో అడ్మిట్ కాలేదు. కానీ తన తల్లిదండ్రులకు మాత్రం రోజు కోచింగ్ కి వెళ్తున్నానని.. దానికి సంబంధించిన పరీక్షలు చాలా బాగా రాస్తున్నట్లు తరచూ ఫోటోలు పంపిస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఫారిన్ ట్రిప్ వెళ్లెందుకు కిడ్నాప్ డ్రామా ఆడగా కథ మొత్తం అడ్డం తిరిగింది.