- ట్రాక్టర్లలో తరలివచ్చిన ఖాళీ బిందెలతో గ్రామస్తుల నిరసన
పెద్దమందడి, వెలుగు: తాగునీటి సమస్య పరిష్కరించాలని వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని చిన్న మందడి గ్రామస్తులు ఆదివారం ఎంపీడీవో ఆఫీసును ముట్టడించారు. గ్రామంలో మంచినీళ్లు రావడం లేదని మిషన్ భగీరథ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని తెలిపారు. అధికారుల తీరును నిరసిస్తూ ట్రాక్టర్లలో గ్రామస్తులు తరలివచ్చి ఖాళీ బిందెలతో ఎంపీడీవో ఆఫీసు ముందు నిరసన తెలిపారు.
తమకు తాగునీటిని అందించాలని కోరారు. అనంతరం ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. కానాయపల్లి ప్రధాన పంప్ హౌస్ దగ్గర కరెంట్ సమస్య రావడంతో నీటి సప్లైలో అంతరాయం కలిగిందని మిషన్ భగీరథ ఏఈ హరీశ్ తెలిపారు. చిన్నమందడి గ్రామానికి సాయంత్రంలోగా తాగు నీటిని సప్లై చేస్తామని తెలిపారు.