- అంజయ్య, సర్పంచ్ సతీశ్ రెడ్డి కలిసి చంపించిన్రు
- వాళ్లకు ఎస్సై నవీన్ సహకరించిండు
- రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణయ్య కొడుకు అశోక్ ఆరోపణ
- మా నాన్న హత్య వెనుక..
జనగామ/బచ్చన్నపేట, వెలుగు
తన తండ్రిని బీఆర్ఎస్ లీడర్లే చంపించారని రిటైర్డ్ ఎంపీడీవో నల్లా రామకృష్ణయ్య కొడుకు అశోక్ ఆరోపించాడు. జనగామ జడ్పీ వైస్‌చైర్మన్ భర్త గిరబోయిన అంజయ్య, సర్పంచ్గంగం సతీశ్ రెడ్డి హత్యకు ప్లాన్ చేస్తే.. లోకల్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సపోర్టు చేశాడని చెప్పాడు. రామకృష్ణయ్యను చంపిన నిందితులు.. చంపక్హిల్స్దగ్గర క్వారీ నీటి గుంతలో పడేయగా డెడ్ బాడీ కుళ్లిపోయింది. దీంతో ఆదివారం అక్కడే పోస్టుమార్టం నిర్వహించిన అధికారులు.. అనంతరం డెడ్‌బాడీని బంధువులకు అప్పగించారు. ఈ సందర్భంగా అశోక్ మీడియాతో మాట్లాడారు. సతీశ్ రెడ్డి డబ్బులు సమకూరిస్తే అంజయ్య సుపారీ ఇచ్చి తన తండ్రిని హత్య చేయించాడని ఆయన తెలిపాడు. వీళ్లకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి నైతిక మద్దతు ఉందని ఆరోపించారు. నిందితులకు సహకరించిన ఎస్సై నవీన్‌ను కూడా నిందితుల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు.
పోలీసుల తీరుపై ఆందోళన..
అంతకుముందు పోలీసుల తీరును నిరసిస్తూ రామకృష్ణయ్య కుటుంబసభ్యులు ఉదయం బచ్చన్నపేట చౌరస్తాలో ధర్నాకు దిగారు. ‘‘మా నాన్నను ఈ నెల 15న సాయంత్రం కిడ్నాప్‌చేశారు. విషయం తెలిసిన వెంటనే డయల్ 100కు ఫోన్ చేసినా పోలీసులు పట్టించుకోలేదు. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదు. లోకల్ ఎస్సై నవీన్ నిందితులతో చేతులు కలిపాడు. సీపీకి ఫిర్యాదు చేయడంతో టాస్క్‌ఫోర్స్‌పోలీసులు రంగంలోకి దిగడం వల్లే హత్య ఉదంతం బయటకు వచ్చింది” అని అశోక్ చెప్పారు. ‘‘శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకే డెడ్ బాడీ దొరికినా, ఎందుకు ఇంత ఆలస్యం చేశారు. రాజకీయ ఒత్తిళ్లతో కేసును తారుమారు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మేం ఎన్నిసార్లు అడిగినా లొకేషన్లోకి ఇప్పుడు వెళ్లలేమని సీఐ చెప్పారు. తీరా చీకటి పడ్డాక ఇప్పుడు కష్టమని చేతులెత్తేశారు. కావాలనే పోలీసులు డెడ్ బాడీ డీకంపోజ్అయి ఎవిడెన్సెస్ ఎరేజ్ అయ్యే వరకు బాడీని అప్పగించలేదు” అని మండిపడ్డారు.
ఎమ్మెల్యేపై విచారణ జరపాలి: బీజేపీ
రామకష్ణయ్య హత్యలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ప్రమేయం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు సమగ్ర దర్యాప్తు జరపాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్ రెడ్డి డిమాండ్‌చేశారు. బాధిత కుటుంబసభ్యులు ఎమ్మెల్యేపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, ఎమ్మెల్యేను విచారించాలని కోరారు.
ఎంతటి వారున్నా వదలొద్దు: ముత్తిరెడ్డి
రామకృష్ణయ్య హత్య కేసులో ఎంతటి వారున్నా వదిలి పెట్టవద్దని సీపీ రంగనాథ్, డీసీపీ సీతారాంను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కోరారు. నిందితులను అరెస్టు చేయాలని, నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి దోషులను శిక్షించాలన్నారు.
బీఆర్ఎస్ నుంచి అంజయ్య సస్పెన్షన్
రామకృష్టయ్య హత్య కేసులో నిందితుడైన గిరబోయిన అంజయ్యను పార్టీ నుంచి సస్పెండ్‌చేస్తున్నట్లు బీఆర్‌ఎస్‌మండల శాఖ అధ్యక్షుడు బొడిగం చంద్రారెడ్డి ప్రకటించారు. అంజయ్యకు సంబంధించిన భూముల గొడవలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. హత్యా రాజకీయాలను తమ పార్టీ ఎప్పుడూ సహించదన్నారు.