
సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలం బీజీ వెంకటాపూర్ లో దళితబంధు తమకెందుకివ్వరని అడిగితే ఎంపీటీసీ దాడి చేసినట్లు ఓ వ్యక్తి ఆరోపించాడు. మంగళవారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ముగిసిన తర్వాత గ్రామానికి చెందిన యాదగిరి తమకెందుకు దళిత బంధు ఇవ్వరని, తాము అర్హులం కామా? అని ఎంపీటీసీ కిరణ్ గౌడ్ ను నిలదీశాడు. దీంతో తీవ్ర ఆవేశానికి గురైన ఎంపీటీసీ కిరణ్ గౌడ్ తనను ప్రశ్నించిన యాదగిరి చెంపపై కొట్టాడు.
దీంతో బాధితుడు జగదేవ్ పూర్ పోలీసులను ఆశ్రయించడంతో గ్రామానికి చెందిన పెద్దలు జోక్యం చేసుకుని రాజీ కుదిర్చారు. గజ్వేల్ నియోజకవర్గంలోని మునిగడప గ్రామంలో దళిత బంధు ఇవ్వాలని దళితులు రాస్తారోకో నిర్వహించారు.