ప్రొటో కాల్ పాటించడం లేదంటూ తిమ్మాపూర్ లో ఎంపీటీసీల నిరసన

కరీంనగర్ జిల్లా : కరీంనగర్ జిల్లాలో తిమ్మాపూర్ మండల సర్వ సభ్య సమావేశంలో ఎంపీటీసీలు నిరసన తెలిపారు. ప్రొటో కాల్ పాటించడం లేదంటూ మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఎంపీటీసలు నిరసన చేపట్టారు. ఇటీవల వచ్చునూరులో ఏర్పాటు చేసిన అభివృద్ధి పనుల శిలా ఫలకంపై ఎంపీటీసీ పేరు లేదని ఎంపీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. అయితే తర్వాత ఏర్పాటు చేయిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. 

అనంతరం జరిగిన సర్వసభ్య సమావేశంలో వచ్చునూరు సర్పంచ్, ఎంపీటీసీల మధ్య వాగ్వాదం జరిగింది. పలు సమస్యలపైన ప్రజాప్రతినిధులు అధికారులను నిలదీశారు. సర్వసభ్య సమావేశానికి పలు శాఖలకు సంబంధించిన ముఖ్య అధికారులు గైర్హాజరయ్యారు. దీంతో గ్రామాల్లోని సమస్యలను ఎవరికి వివరించాలని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకువచ్చిన సమస్యలే ఇప్పటివరకు పరిష్కారం కాకపోతే.. ఈ సమావేశం నిర్వహించడం ఎందుకని ఎంపీటీసీలు నిలదీశారు. సమావేశాన్ని బహిష్కరించి నిరసన చేపట్టారు.