
అనుష్క, నవీన్ పొలిశెట్టి జంటగా రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. మహేష్ బాబు.పి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. ఈనెల 7న సినిమా విడుదలవుతున్న సందర్భంగా సోమవారం ప్రెస్‌మీట్ నిర్వహించారు. హీరో నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ ‘కృష్ణాష్టమి రోజు సినిమా రిలీజ్ అవుతోంది, కృష్ణుడు ఎలా అల్లరి చేస్తాడో, ఈ సినిమా కూడా అంతే అల్లరిగా ఉంటుంది. ప్రమోషనల్ టూర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 6 నుంచి యూఎస్ టూర్‌కు వెళ్తున్నాం. ‘జాతి రత్నాలు’ తర్వాత దర్శకుడు మహేష్ ఈ కథ చెప్పగానే కొద్దిసేపు ట్రాన్స్‌లో ఉండిపోయా.
అంత మంచి కథ ఇది. దీనికి పూర్తి సమయం కేటాయించాలనే మరో సినిమా చేయలేదు. తెలుగు ప్రేక్షకులకు స్టాండప్ కామెడీని పరిచయం చేయాలని రీసెర్చ్ జరిపి, పక్కాగా తీశాం. కథలో ఎమోషన్, మంచి క్యారెక్టర్స్, ఎంటర్‌టైన్మెంట్ ఉంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్స్‌లో ఇది ఒక కొత్త యాంగిల్‌లో ఉంటుంది. అది నాకూ, అనుష్క గారికి ఇంప్రెసివ్‌గా అనిపించింది. సినిమాలో క్లీన్ ఎంటర్‌టైన్మెంట్ ఉంటుంది. యూవీ సంస్థలో సినిమా చేస్తే ఆడియెన్స్‌కు మరింత రీచ్ ఉంటుంది, డిస్ట్రిబ్యూషన్ బాగా చేస్తారని నమ్మాను’ అన్నాడు. దర్శకుడు మాట్లాడుతూ ‘ట్రైలర్‌లో చూసిన కంటెంట్ 30 పర్సెంట్ అనుకుంటే సినిమాలో 70 పర్సెంట్ ఎమోషన్, ఎంటర్‌టైన్మెంట్ ఉంటుంది. మూవీ అంతా ఒక బ్యూటిఫుల్ జర్నీ అనిపిస్తుంది’ అని చెప్పాడు.