పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ చైర్మన్ ను తొలగించాలె

పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ చైర్మన్ ను తొలగించాలె

వరంగల్ : రాష్ట్రంలో పోలీస్ రిక్రూట్ మెంట్ లో అవకతవకలు జరిగాయని MRPS అధినేత మందకృష్ణ మాదిగ ఆరోపించారు. పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ తీసుకున్న రిజర్వేషన్ల అమలులో నిబంధనలను అతిక్రమించారని, రాజ్యాంగ పరిధిలో ఉన్న రిజర్వేషన్లు అమలు చేయడం లేదని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను అమలు చేయని బోర్డ్ చైర్మన్ శ్రీనివాసరావును తప్పించి ఎస్సీ, ఎస్టీ, బీసీ ఐపీఎస్ అధికారులను నియమించాలని డిమాండ్ చేశారు. కటాఫ్ మార్కులు ఏ వర్గాలకు ఉన్న మార్కులు వారికే ఉండాలన్నారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు కాకుండా బోర్డ్ చైర్మన్ అడ్డుకున్నారని తెలిపారు. తాను ఇదే విషయంపై మంత్రులతో మాట్లాడితే ఉల్లంఘన జరిగిందని వారు కూడా చెప్పారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక చట్టం ఉందని, రాజ్యాంగం మారుస్తానని సీఎం కేసీఆర్ ఎలా కామెంట్స్ చేస్తారంటూ ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తే మార్చడానికి సిద్ధంగా ఉన్నారని అర్థమవుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఎత్తివేయాలని చూస్తోందన్నారు. 

పరీక్షా ఫలితాలు రాకముందే కొన్ని సబ్ నోటిఫికేషన్ ఇవ్వాలని మందకృష్ణ మాదిగ కోరారు. ఒకవేళ బోర్డు నిర్ణయం తప్పయితే బోర్డే బాధ్యత వహించాలన్నారు. సీఎం కేసీఆర్ దీనిపై నిర్ణయం తీసుకోకుంటే రాజకీయ పతనానికి నాంది అవుతుందన్నారు. ఈ విషయంలో కేసీఆర్ ను మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి చర్చించాలన్నారు. ఈనెల 11వ తేదీన ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల్లో అభ్యర్థులతో కలిసి వినతి పత్రాలు అందిస్తామన్నారు. ఈనెల 12వ తేదీన హైదరాబాద్ లోనూ వినతిపత్రాలు ఇస్తామన్నారు. అప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే.. ఈనెల13వ తేదీన ఇందిరాపార్కు వద్ద దీక్షకు కూర్చుంటామన్నారు. లేదంటే నిరవధిక దీక్షకు కూడా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.