- సీఎం రేవంత్ రెడ్డి మాదిగల దేవుడు
- త్వరలో విజయోత్సవ సంబురాలు నిర్వహిస్తామని వెల్లడి
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఎస్సీ వర్గీకరణలో మాదిగలకు న్యాయమే జరిగిందని ఎమ్మార్పీఎస్ ఫౌండర్ జనరల్ సెక్రటరీ దేవని సతీశ్ అన్నారు. మాదిగల హక్కులను అర్థం చేసుకుని వారిని గెలిపించిన దేవుడు సీఎం రేవంత్ రెడ్డి అని ప్రశంసించారు. ఎస్సీ వర్గీకరణ అనంతరం.. మాదిగలకు 11శాతం రిజర్వేషన్ రావాల్సి ఉంటే 9శాతమే ఇచ్చారని మాదిగ సామాజిక వర్గాన్ని గందరగోళంలోకి నెట్టడానికి ప్రయత్నిస్తున్న మందకృష్ణ మాదిగ మాటలు నమ్మొద్దని కోరారు.
గురువారం సోమాజిగూడ ప్రెస్ క్టబ్ లో దేవని సతీశ్ మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణలో మొత్తం 15శాతం నుంచి మాదిగలకు 9 శాతం దక్కిందని, మిగితా శాతం కూడా తమ ఉపకులాలకే దక్కిందన్నారు. దీనిపై ఆనందపడాల్సిందిపోయి తప్పుడు ప్రచారం చేయడం ఏంటని మందకృష్ణను ప్రశ్నించారు. మంత్రి దామోదర రాజ నర్సింహపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలిపారు. మాదిగలను తప్పుదోవ పట్టిస్తున్న మందకృష్ణ.. నేతకానీ–మాలల మధ్య చిచ్చు పెడుతున్నడని ఆరోపించారు.
ఆయన మెడలో నల్ల కండువా ఉంటుందని..కానీ లోపల ఉన్నదంతా కాశాయ కండువా అని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కోసం మోదీని సంప్రదించినా ఏమీ స్పందించలేదని.. దమ్ముంటే 370 జీవోను రద్దు చేపియ్యాలని డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వర్గీకరణ బిల్లు పెట్టేలా మందకృష్ణ సలహా ఇచ్చి అమలయ్యేలా చూడగలరా అని నిలదీశారు. రాజకీయ చిచ్చులో సెగ కాచుకునే వ్యక్తి మందకృష్ణ అని మండిపడ్డారు. ఆయన ఇకనైనా బోగస్ ఉద్యమాలు ఆపాలని సూచించారు.