- ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి
- వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామని వెల్లడి
బషీర్ బాగ్, వెలుగు: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కుటుంబాన్ని విమర్శించే నైతిక హక్కు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు లేదని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు అన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వస్తుంటే , మందకృష్ణ ఒక్కరే సమర్థిస్తున్నారని విమర్శించారు.
మాదిగల కంటే మాలలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని, కానీ తప్పుడు లెక్కలతో మందకృష్ణ మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. శనివారం హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో సమితి నాయకులు బత్తుల రాంప్రసాద్ మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, అందులో భాగంగా సెప్టెంబర్ 4న రాష్ట్రంలోని కలెక్టరేట్ల ముట్టడి, 11న ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్ పిలుపు మేరకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా, 19న నిరసన ర్యాలీలు చేపడతామన్నారు.
వీటితో పాటు న్యాయ పోరాటం కూడా చేస్తున్నామని స్పష్టం చేశారు. సమావేశంలో పోరాట సమితి నాయకులు వినోద్ కుమార్, పిల్లి సుధాకర్, జంగా శ్రీనివాస్, దార సత్యం, ఆవుల సుధీర్ బాలనందం, లలిత, రుక్మిణి
తదితరులు పాల్గొన్నారు.