- ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
బషీర్ బాగ్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ ఆలస్యంతో మాదిగలు నష్టపోతున్నారని ఎమ్మార్పీఎస్వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చెప్పారు. దేశంలో ముందుగా వర్గీకరణ చేపడతామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సీఎం రేవంత్రెడ్డి.. 11 వేల మంది టీచర్లకు నియామక పత్రాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. 11 వేల పోస్టుల్లో ఎస్సీలకు1,650 పోస్టులు రావాల్సి ఉండగా, వాటిలో 1,100 పోస్టులు మాదిగ, మాదిగ ఉప కులాలకు రావాల్సి ఉందని చెప్పారు.
వర్గీకరణ చేపట్టకపోవడంతో మాదిగ జాతి తీవ్రంగా నష్టపోతుందన్నారు. కనీసం 600 పోస్టులు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మందకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలుపుతామని చెప్పారు. జిల్లా కేంద్రాల్లోని అంబేద్కర్ విగ్రహాల నుంచి కలెక్టరేట్ల వరకు ర్యాలీలు నిర్వహించి, కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేస్తామన్నారు. సిటీలోని లోయర్ ట్యాంక్ బండ్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి బషీర్బాగ్బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ ఉంటుందని చెప్పారు.