వర్గీకరణను వ్యతిరేకిస్తే రాళ్లు, చెప్పులతో కొట్టాలి: సతీశ్​మాదిగ

వర్గీకరణను వ్యతిరేకిస్తే రాళ్లు, చెప్పులతో కొట్టాలి: సతీశ్​మాదిగ
  • వర్గీకరణలో మాదిగల వాటా న్యాయమైనదే
  • ఉద్యమం ఆరంభంలో ఉన్నవారు ఇప్పుడు మందకృష్ణతో లేరు
  • గ్రూప్స్​ ఎగ్జామ్స్​ పేరుతో మాదిగ విద్యార్థులను రెచ్చగొడుతున్నారని ఫైర్

పంజాగుట్ట, వెలుగు: ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించేవారిని చెప్పులు, రాళ్లతో కొట్టి సమాధానం చెప్పాలని తెలంగాణ మాదిగ దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మార్పీఎస్​వ్యవస్థాపక జనరల్​సెక్రటరీ దేవని సతీశ్​మాదిగ అన్నారు. ఎస్సీ వర్గీకరణను ఎవరు వ్యతిరేకించినా తరిమితరిమి కొడతామన్నారు. మొట్టమొదటి ఎమ్మార్పీఎస్​ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం బుధవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో జరిగింది. సతీశ్​మాదిగ అధ్యక్షత వహించగా.. తెలంగాణతోపాటు ఆంధ్రప్రాంత ఉద్యమకారులు హాజరయ్యారు. 30 ఏండ్ల పాటు ఎమ్మార్పీఎస్​ ఉద్యమంలో మందకృష్ణతో ఉన్న వారంతా హాజరైనట్టు సతీశ్​మాదిగ తెలిపారు.ముందు నుంచి మందకృష్ణతో ఉన్నవారు ఇప్పుడు ఎవరూ అతనితో లేరన్నారు. 

వర్గీకరణ చేయాలని కోరిన మందకృష్ణ.. ఇప్పుడు వర్గీకరణ వద్దంటున్నాడని పేర్కొన్నారు. చిన్న పిల్లలను వెంట బెట్టుకుని తిరుగుతున్నారన్నారు. గ్రూప్​ -1,2,3,4 పేరుతో విద్యార్థులను రెచ్చ గొడుతున్న నాయకుడి మాటలు నమ్మొద్దని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీరిజర్వేషన్ ఉప వర్గీకరణ చేస్తూ చట్టం తీసుకొస్తున్నందుకు మొట్టమొదటి ఎమ్మార్పీఎస్ ఉద్యమకారులు​కాంగ్రెస్ పార్టీకి, మంత్రి దామోదర రాజనర్సింహకు కృతజ్ఞతలు తెలిపారు. 

2024 ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు కాంగ్రెస్​ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్​రెడ్డి చెబుతూనే.. అవకాశం ఉంటే గతంలో ప్రకటించిన గ్రూప్​-1, గ్రూప్​ -2, గ్రూప్​-3, గ్రూప్​-4  ఇతర ఉద్యోగాలలో కూడా ఆర్డినెన్స్​తీసుకు వచ్చి వాటిలో కూడా వర్గీకరణ అమలు చేస్తామని ప్రకటించారని సతీశ్​మాదిగ గుర్తుచేశారు.