కాంగ్రెస్ కు ఓటు వేసి తప్పు చేశామని.. ప్రజలకు క్లారిటీ వచ్చింది: జగదీష్ రెడ్డి

గత 10 సంవత్సరాలలో లేని కరువు ఇప్పుడు వచ్చిందని... కనీసం జిల్లా మంత్రులకు రైతులను పరామర్శించే సమయం లేదని విమర్శించారు సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి.
 అక్రమ వసూళ్లలో జిల్లా మంత్రులు బిజీ అయ్యారని ఆయన మండిపడ్డారు. వ్యాపారవేత్తలను, మిల్లర్లను ఇబ్బంది పెట్టి మరి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.  ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమయం సందర్భం లేకుండా మాట్లాడిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఇప్పుడు జిల్లా ప్రజలను పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే దుయ్యబట్టారు.

 కాంగ్రెస్ కు ఓటు వేసి తప్పు చేశామని ఇప్పటికే ప్రజలు క్లారిటీకి వచ్చారని జగదీష్ రెడ్డి అన్నారు.  పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటేస్తామని స్పష్టంగా చెబుతున్నారన్నారు. 
 నల్గొండ,  భువనగిరితో పాటు 16 స్థానాల్లోనూ బీఆర్ఎస్ ముందుంటుందని చెప్పారు.  మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అవగాహన లేకుండ దద్దమ్మలా మాట్లాడుతున్నాడని ఫైరయ్యారు.   కృష్ణ, ఎస్ఎల్బీసీ , కాళేశ్వరం నీళ్ళని ఎలా వాడుకోవాలనే సోయి కూడా ఈ ప్రభుత్వానికి లేదని ఎద్దేవా చేశారు. 

ప్రజా సమస్యలను పక్కదారి పట్టించి ప్రజలను గందరగోళం సృష్టించేందుకే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని  తెరపైకి తీసుకొచ్చారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ అనేది బోగస్.. ఎక్కడా, ఎవరి దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని ఆయన చెప్పారు. తన మంత్రి పదవిని కాపాడుకునేందుకు ఉదయం లేచిన నుండి సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు కోమటిరెడ్డి నిలబడుతున్నాడని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండు పంటలకు నీళ్లు ఇచ్చి రైతులను కాపాడుకున్నామన్నారు. ఆదివారం జనగామ, యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాల్లో కేసీఆర్ పర్యటన ఉంటుందని తెలిపారు.  ఎండిపోయిన పంట పొలాలు పరిశీలించడంతో పాటు రైతులతో ముచ్చటించి జిల్లా పరిస్థితులపై మాట్లాడుతారని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చెప్పారు.