‘జనవాణి’గా ఏలికలకు హెచ్చరికగా నిలిచి జనధర్మ జర్నలిస్ట్ అనే కీర్తి సాధించారు వరంగల్ ప్రజాప్రియుడు ఎంఎస్ ఆచార్య. ‘ఆచార్యో భవ’... ‘జనధర్మ అయ్యగారు’గా జనం నాల్కలపై నిలిచి అభిమానం చూరగొన్నారు. చంద్రునికో నూలుపోగులా- ఎద సంద్రంలో ఒక పొంగు ప్రేమాభిమానాలు పెల్లుబికిన ఆనందవేళ ఆచార్యా స్వీకరించండీ అభినందన. పేరున్న పెద్ద పత్రికలు మా ఊరిని చిన్నచూపు చూసినప్పుడు, స్థానిక వార్తలకు స్థానం కరువైనప్పుడు, మీరు వెలిగించిన ఒక దీపశిఖ మారుమూల గ్రామాల్లోని ఈనాటి చైతన్యదీప్తికి ఆలంబనమైంది’. ఇవి పెండ్యాల చిన రాఘవరావు చెప్పిన మాటలు. ‘పేపర్ అయ్యగారు’, ‘పెద్ద అయ్యగారు’ అని ఆప్యాయంగా పిలుచుకున్న స్వాతంత్ర్య సమర యోధుడు, జర్నలిస్టు, వరంగల్ వాణి దినపత్రిక, జనధర్మ వారపత్రికల ఎడిటర్ ఎంఎస్ ఆచార్య. ఈ రోజు అక్టోబరు 3న ఆయన శతజయంతి (1924 నుంచి 2024). ఎంఎస్ ఆచార్య జీవన ఉజ్జీవనం అనిపించే గాథ రాసింది చిన రాఘవరావు.
పెండ్యాల రాఘవరావు స్వాతంత్ర్య సమరయోధుడు, ఊరిపేరు చిన్న పెండ్యాల, వరంగల్ జిల్లా. జననం 1917 మార్చి 15, మరణం1987 సెప్టెంబరు 10 (వయసు 70). వారి జీవిత భాగస్వామి వెంకటమ్మ, సంతానం ఇద్దరు. 1952 సంవత్సరంలో పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ (కమ్యూనిస్టు పార్టీ) తరఫున మొట్టమొదటిసారిగా వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి భారత పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ఆయన Conversion Movement (1935–-36) ను వ్యతిరేకించి,1938లో కాంగ్రెస్ సత్యాగ్రహంలో చేరారు. బ్రిటిష్ ప్రభుత్వం అందులకు రూ.300 జరిమానాను విధించి ఖైదు చేసింది. తర్వాత ఆంధ్ర మహాసభలో చేరాడు. రజాకార్ల ఉద్యమాన్ని వ్యతిరేకించి Peoples Democratic Front సభ్యునిగా చేరాడు.
సామాన్యులకు పెద్దదిక్కు ‘జనధర్మ’
ఎంఎస్ ఆచార్య షష్ఠి పూర్తి సందర్భంలో 1988లోప్రచురించిన ఒక అభినందన సంచికలో రాఘవరావు రచించిన ఆచార్య జీవనగాథ ఇది. ‘ముప్పయ్యేండ్ల నాడు దిక్కు కోసం కొట్టుమిట్టాడుతున్న సామాన్యులు, సాహిత్యోపజీవులకు మీ ‘జనధర్మ’ నిజానికి పెద్దదిక్కే అయ్యి నిలిచింది. పెద్ద పత్రికలు చేయలేని పనిని చిన్నపత్రికలు చేసి చూపించగలవు. అన్న సత్యాన్ని రుజువు చేసిన ఘటికులు మీరు. తెలుగునాట ఓ కొత్త పత్రిక పుట్టడమే ఓ వింత. బట్టకట్టి పదికాలాలపాటు బతకటం మరింత వింత. - ‘వరంగల్ వాణి’ దినపత్రికగా ఎదిగిపోవడం నేపథ్యంలో కష్టాల గడగండ్లను, చిరునవ్వుతో స్వీకరించే మీ స్థితప్రజ్ఞత అమోఘం. ‘వననూలి’ వంటి నిరంతర రచనా వ్యాసంగ దీర్ఘ నిమగ్నత, చెప్పకనే చెప్పే అక్షర సత్యాలు! పట్టువదలని విక్రమార్కులు మీరు! అనవరత జాగరూకతే- ప్రజాస్వామ్యం సాఫల్యానికి రక్ష, మనుగడకూ, అభిప్రాయ ప్రకటనా స్వేచ్ఛయే శ్రీరామరక్ష!ఏలికలకు హెచ్చరికగా ‘జనధర్మ’వరంగల్ వాణి- ‘జనవాణి’గా- ఏలికలకు హెచ్చరికగా- నిలిచినాయి నేడు’ అని రాఘవరావు వివరించారు. రాఘవరావు వరంగల్లులో జనధర్మకు తన దేశ స్వాతంత్ర్య పోరాట గాథను సీరియల్‌గా అద్భుతంగా రచించారు. ఆరోజుల్లో రాఘవరావు సీరియల్ చదవడానికి ఎందరో ఎదురుచూసే వారు. నేను ప్రెస్‌లో కంపోజ్ చేస్తున్న రోజుల్లో రాఘవరావు తన రచన భాగాలను స్వయంగా వచ్చి నాన్నతో గంటలకొద్దీ మాట్లాడుతూ ఉంటే నేనే కంపోజ్ ఆపేసి, మా చుట్టూ ఉన్న వర్కర్లు కూడా ఒక్క అక్షరం కూడా వదలకుండా వినడం నాకు తెలుసు.
Also Read : జనవాణిగా ఏలికలకు హెచ్చరిక ‘జనధర్మ’ ఎంఎస్ ఆచార్య
సూర్యాపేట నుంచి నెల్లికుదురు దాకా..
నల్లగొండ సూర్యాపేటలో తన అమ్మ ఇంట్లో పుట్టిన ఎంఎస్ ఆచార్య వరంగల్లు నెల్లికుదురులో పెరిగారు. ‘అదృష్టవశాత్తు మీ బిడ్డలు సైతం వన్నె
తెస్తున్నవారైనారు పత్రికా ప్రపంచానికి.. అది చాలు మీ జన్మసార్థకతకు, ధన్యతకు! ఈ ముప్ఫయ్యేండ్ల మన స్నేహబంధాన్ని ఎట్లా మరచిపోగలను నేను! విశిష్టాచార సంప్రదాయాల కుదురు మీ నెల్లికుదురు! మీ మాడభూషణం వారి కుదురు విద్వత్తుకు కుదురు! ఎదుటివారికి బెదురు! పండితులైన మా మాతగారి సరసన మీ తాతగారొకరు. ద్రావిడ ప్రబంధాల గోష్టి కాలక్షేపం చేస్తూ ఉండేవారని గుర్తు చేస్తున్నాను’ అంటూ రాఘవరావుగారు పేర్కొన్నారు.
తన అభినందన రచనలో రాఘవరావు ఈ విధంగా ముగించారు. ‘మిత్రమా! మన మైత్రీబంధం జన్మాంతరాలదని, ఈ ప్రాంతం ప్రతి సామాజిక జీవనవృత్తంలో మీ ప్రమేయం లేని ఏ కార్యక్రమమూ, ఏ సత్కార్యమూ లేదేమో, మాలోని ప్రతిభావ్యుత్పత్తుల మూలంగా ఇక్కడ ఏ ఒక్కరికీ ఏమాత్రం మేలు జరిగినా అందుకు పరోక్షంగా కారణభూతులు మీరే. అందుకే ఆచార్యా! మీకీ అభినందనలు! శత సహస్ర మాసపూర్ణ జీవితం, దైన్యమెరుగని శేషజీవితం, ఆయురారోగ్యాలతో విలసిల్లాలని కాంక్షిస్తూ, ఆకాంక్షిస్తూ మరోసారి అభినందిస్తూ అని పెండ్యాల చిన రాఘవరావు అన్నారు. కాగా, 70 సంవత్సరాల వయసులో గుండెపోటుతో ఎంఎస్ ఆచార్యులు 12 జులై 1994న కాలధర్మం చెందారు. ఎంఎస్ ఆచార్య ఒక తెలంగాణ వీరుడు, జర్నలిస్టు, వరంగల్ రచయితకు ఈ రోజు శతజయంతి.
వెలుగుబాటలో ఎందరో..
జర్నలిస్టులను తయారు చేసిన కళాశాల జనధర్మ వారపత్రిక. 1958 నుంచి 1994 దాకా ఎంఎస్ ఆచార్య జీవించారు. ‘ఎంతో ఉత్కృష్ట లక్ష్యంతో అలనాడు మీరు సాహసంతో వేసిన ముందడుగు, చూపిన వెలుగు బాటలో ఈవేళ ఎందరో ఉన్నారు. ఒక అశోక్, ఒక శ్రీధర్, మరెందరో? గ్రామీణ విద్యుత్ వినియోగదారుల అవస్థలు, విద్యారంగ కువ్యవస్థ, నడ్డి విరిగిన రైతన్నల కడగండ్ల గాథలు, స్వాతంత్య్ర సమరయోధుల స్వీయగాథలు, సమస్యల భావచిత్రాలు- ఒకటేమిటి సకల కళా సమాహారంలా నడుస్తున్న చరిత్రకు అద్దం పట్టింది జనధర్మ.
- మాడభూషి శ్రీధర్ ప్రొఫెసర్ ఆఫ్ లా