
న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను లెజెండరీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ సమర్థించాడు. ఈ రూల్ తీసుకొచ్చిన కొత్తలో తనకు అసలు నచ్చలేదన్న మహీ ఆట మరింత ఆసక్తిగా మారడానికి ఇది ఉపయోగపడిందన్నాడు. ‘ఈ రూల్‌ను అమలు చేసిన కొత్తలో నాకైతే అవసరం లేదనిపించింది. నేను ఇప్పటికి వికెట్ కీపింగ్ చేస్తాను. కాబ్టటి నేను ఇంపాక్ట్ ప్లేయర్‌ను కాదు. ఆటలో భాగం కావడమే నాకు ముఖ్యం. ఈ రూల్ వల్ల మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు నమోదవుతాయని చాలా మంది అంటున్నారు.
నా వరకైతే ఆటగాళ్ల ఆలోచన విధానం, పిచ్ పరిస్థితుల వల్లే భారీ స్కోర్లు వస్తాయని నమ్ముతా’ అని ధోనీ పేర్కొన్నాడు. క్లిష్ట పరిస్థితుల్లో ఎక్స్‌ట్రా బ్యాటర్ ఉన్నాడనే భరోసా జట్టుకు కలుగుతుందన్నాడు. ఎక్స్‌ట్రా బ్యాటర్ వల్ల భారీ స్కోరు వస్తుందనే నమ్మకం కంటే.. ముందుగా వచ్చే ప్లేయర్లు మరింత దూకుడుగా ఆడే పరిస్థితిని కలిగిస్తుందన్నాడు. టీ20 క్రికెట్‌లో ఇదో కొత్త పరిణామంగా చెప్పొచ్చని మహీ అభిప్రాయపడ్డాడు.