Gensol Stock: ధోనీకి భారీ నష్టం.. కెప్టెన్ కూల్‌ని క్లీన్ బౌల్డ్ చేసిన జెన్సోల్ స్టాక్..

Gensol Stock: ధోనీకి భారీ నష్టం.. కెప్టెన్ కూల్‌ని క్లీన్ బౌల్డ్ చేసిన జెన్సోల్ స్టాక్..

MS Dhoni Investments: ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లలో ఎవరి నోట విన్నా ఒక్కటే మాట అదే జెన్సోల్ ఇంజనీరింగ్. ఈ కంపెనీ ప్రమోటర్లు రుణాలుగా తీసుకున్న డబ్బును దుర్వినియోగం చేశారని, లగ్జరీ జీవితాన్ని గడిపేందుకు అక్రమంగా తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నట్లు సెబీ దర్యాప్తులో తేలింది. దీంతో గడచిన రెండు రోజులుగా కంపెనీ షేర్లు 5 శాతం లోయర్ సర్క్యూట్లో లాక్ అవుతున్నాయి. ప్రమోటర్లపై సెబీ ఆంక్షలు విధించిన తర్వాత ఇన్వెస్టర్లలో ఆందోళన తీవ్ర స్థాయిలకు చేరుకుంది. 

అయితే జెన్సోల్ ఇంజనీరింగ్ కంపెనీ షేర్లు మార్కెట్లో క్రాష్ అవుతున్న వేళ తాజాగా ఒక విషయం వెలుగులోకి వచ్చింది. ఐపీఎల్ టీం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహీంద్ర సింగ్ ధోనీ కుటుంబ ఆఫీస్ కూడా ఈ కంపెనీలో ఈ ఏడాది జనవరిలో పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడైంది. కంపెనీ సిరీస్ బీ కింద రూ.420 కోట్ల ఫండ్ రైజింగ్ నిర్వహించగా అందులో ధోనీ కూడా పెట్టుబడులు పెట్టారని వెల్లడైంది. 

 

దీనికి ముందు సైతం గతంలో మహీంద్ర సింగ్ ధోనీ కుటుంబం అమరపాలి గ్రూప్ కంపెనీలో ఇలాగే పెట్టుబడులను పెట్టి నష్టాలను మూటగట్టుకుంది. దీంతో ధోనీకి ఈక్విటీ పెట్టుబడులు అచ్చిరాలేదని కొందరు అంటున్నారు. వాస్తవానికి గత ఏడాదిలో కంపెనీలో జరుగుతున్న కొన్ని అక్రమాలపై వచ్చిన రిపోర్టులపై మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ దర్యాప్తు కొనసాగిస్తోంది. అయితే దీని తర్వాత 2025 ప్రారంభంలో జెన్సోల్ నిర్వహించిన ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో ధోనీ సంస్థ కూడా పార్టిసిపేట్ చేసింది. ఇది హై గ్రోత్ ఈక్విటీల్లో పెట్టుబడుల్లో ఉండే ప్రమాదాన్ని ఎత్తి చూపుతోందని నిపుణులు అంటున్నారు.

వాస్తవానికి జెన్సోల్ కంపెనీ షేర్లు ఒకప్పుడు ఒక్కోటి రూ.వెయ్యి 126 మార్కును చేరుకోగా.. ప్రస్తుతం రూ.122 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. దీంతో కంపెనీ షేర్ల విలువ ఏకంగా 85 శాతానికి పైగా కోల్పోయింది. ప్రస్తుతం సెబీ దర్యాప్తులో ఉన్న జెన్సోల్ ప్రమోటర్లు అన్మోల్ సింగ్ జగ్గా, పునీత్ సింగ్ జగ్గాలను యాజమాన్య బాధ్యతల నుంచి రెగ్యులేటరీ తప్పించింది. అలాగే వారు స్టాక్ మార్కెట్లలో పార్టిసిపేట్ చేయకూడదంటూ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.