టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనికి ఉండే క్రేజే వేరు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించినా..అతని ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. ఇక అంతర్జాతీయ క్రికెట్ లోనే కాదు..ఐపీఎల్ లోనూ ధోని తనదైన ముద్ర వేశారు. పుట్టింది, పెరిగింది జార్ఖండ్ లో అయినా..ఐపీఎల్ అభిమానులు మాత్రం అతన్ని చెన్నైకి చెందిన వ్యక్తిగా గుర్తిస్తారు..గౌరవిస్తారు. చెన్నైలో ధోని అంటే ప్రతీ ఒక్కరికి ఇష్టం, అభిమానం..విపరీతమైన ప్రేమ. దీనికి చెన్నై సూపర్ కింగ్స్ ఒక్కటే కాదు..ధోని మనస్థత్వం..ధోని మాట్లాడే విధానం..ధోని కలుపుగోలు తనం. ఇవే చెన్నై అభిమానులకు ధోని దగ్గరయ్యేలా చేసింది. అయితే చెన్నై మైదానంలో ఒకలా ఉండే ధోని ...మైదానం మరోలా ఉంటాడు. ఇందుకు అతని కాఫీ కథే నిదర్శనం.
ఐపీఎల్లో ధోనికి చెన్నై హోమ్ గ్రౌండ్. ఇక్కడ అడయార్ పార్క్‌లోని క్రౌన్ ప్లాజా హోటల్తో ధోనికి ప్రత్యేక అనుబంధం ఉంది. ఐపీఎల్ ఆడుతున్న సమయంలో ధోనితో పాటు చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు 10 ఏళ్లకు పైగా ఇక్కడే ఉన్నారు. వీరంతా క్రౌన్ ప్లాజాలోని దక్షిణ్ రెస్టారెంట్ కాఫీపై విపరీతమైన ప్రేమను పెంచుకున్నారు. ముఖ్యంగా MD సురేష్ తయారు చేసే బ్రూ కాఫీ అంటే ధోనితో సహా చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు పడిచచ్చిపోతారంటే అతిశయోక్తికాదేమో.
ధోని మెచ్చిన ఫిల్టర్ కాఫీ...
సురేష్ 10 ఏళ్లుగా క్రౌన్ ప్లాజాలోని దక్షిణ్ రెస్టారెంట్లో కాఫీని తయారు చేస్తున్నాడు. అతను బ్రూ ఫిల్టర్ కాఫీ అద్భుతంగా తయారు చేస్తాడన్న పేరుంది. అయితే ఈ రెస్టారెంట్ కు తొలిసారిగా ధోని 2008లో వచ్చాడు. ఈ సమయంలో సురేష్ ఫిల్టర్ కాఫీని తయారు చేసి ధోనికి ఇచ్చాడు. ఇది తాగిన ధోని అద్భుతమని కితాబిచ్చాడు. అప్పటి నుంచి సురేష్ తయారు చేసే ఫిల్టర్ కాఫీపై ధోని ప్రేమ పెంచుకున్నాడు. ముఖ్యంగా సురేష్ నైపుణ్యాన్ని మెచ్చుకున్నాడు. అతను కాఫీ చేయడం చూసి ఆనందించాడు. ధోని, సురేష్ మధ్య సంబంధం కస్టమర్, సర్వర్‌లకు మించి పెరిగింది. ఫిల్టర్ కాఫీతో సురేష్ చెన్నై ఆటగాళ్లకు దగ్గరయ్యాడు. ధోనికే కాదు..ఈ ఫిల్టర్ కాఫీ షేన్ వాట్సన్, మురళీ విజయ్ వంటి ఇతర ఆటగాళ్లను కూడా ఆకర్షించింది.
ఈ సారి మిస్సయ్యారు..
ఐపీఎల్ 2023లో ధోని సహా చెన్నై ఆటగాళ్లు ఈ సారి క్రౌన్ ప్లాజా హోటళ్లో బస చేయడం లేదు. దీంతో చెన్నై టీమ్ను మిస్సవుతున్నానంటూ సురేష్ తెగబాధపడిపోతున్నాడు. ఈసారి చెన్నై టీమ్ను ..ముఖ్యంగా ధోనిని మిస్ అవుతున్నానని ఫీల్ అవుతున్నాడు. కానీ ధోనికి తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నాడు.