
లక్నో సూపర్ జయింట్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ధోనీ ఫీల్డింగ్ లో అదరగొట్టాడు. సోమవారం (ఏప్రిల్ 14) ఎకనా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో రెప్పపాటులో ఒక రనౌట్ చేసి ఔరా అనిపించాడు. లక్నో మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇన్నింగ్స్ చివర్లో ఈ రనౌట్ చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ 20 ఓవర్లో అబ్దుల్ సమద్ కు రెండో బంతిని పతిరానా వైడ్ బాల్ వేశాడు. నాన్ స్ట్రైకింగ్ లో ఉన్న పంత్ సింగిల్ కు రావాల్సిందిగా కోరాడు.
సమద్ వెంటనే స్పందించి సింగిల్ కోసం పరిగెత్తాడు. బ్యాట్ క్రీజ్ లో పెట్టబోయే సమయానికి ధోనీ చాలా దూరం నుంచి వేసిన త్రో వికెట్లను తగిలింది. రీప్లేలో చూడగా బ్యాట్ క్రీజ్ బయటే ఉండడంతో ఔట్ అని తేలింది. అప్పటివరకు రెండు సిక్సర్లతో మంచి ఊపు మీదున్న సమద్ ను పంత్ సింగిల్ కు రమ్మని పిలవడం షాకింగ్ కు గురి చేసింది. ధోనీ చేసిన ఈ రనౌట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటివరకు క్యాచ్, స్టంపౌట్ లలో తిరుగులేదనిపించిన మాహీ.. రనౌట్స్ లో కూడా గురి తప్పలేదు. ఈ మ్యాచ్ లో అద్భుతమైన DRS తో పూరన్ ను పెవిలియన్ కు పంపిన ధోనీ.. బదోనీని స్టంపౌట్ చేశాడు.
Dhoni's game awareness at this age is remarkable. I have never seen someone execute a run-out so casually.
— Abhishek (@MSDianAbhiii) April 14, 2025
pic.twitter.com/G4Za2woQCH
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగుల ఒక మాదిరి స్కోర్ కే పరిమితమైంది. ఒకవైపు వికెట్లు పడుతున్నా చివరి ఓవర్ వరకు క్రీజ్ లో ఉన్న పంత్ 63 పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. చెన్నై బౌలర్లలో పతిరానా, జడేజా తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఖలీల్ అహ్మద్, కంబోజ్ లకు చెరో వికెట్ దక్కింది.