
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తనలో ఇంకా ఫినిషర్ మిగిలే ఉన్నాడని మరోసారి నిరూపించాడు. ఇటీవలే తీవ్ర విమర్శలకు గురైన ధోనీ ఒక్క మ్యాచ్ తో విమర్శకులకు గట్టిగా సమాధానం చెప్పాడు. లక్నో సూపర్ జయింట్స్ తో సోమవారం (ఏప్రిల్ 14) జరిగిన మ్యాచ్ లో ఛేజింగ్ చేస్తున్న సమయంలో 11 బంతుల్లోనే 26 పరుగులు చేసి చెన్నైకి థ్రిల్లింగ్ విక్టరీ అందించాడు. ధోనీ ఇన్నింగ్స్ లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ఒత్తిడిలో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన ధోనీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
Also Read :- బంగ్లాదేశ్ టూర్‌కు టీమిండియా
ఆరేళ్ల తర్వాత ధోనీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలవడం విశేషం. చివరిసారిగా 2019లో మహేంద్రుడుకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. మ్యాచ్ తర్వాత ప్రెసెంటేషన్ లో ధోనీతో మురళీ కార్తీక్ మాట్లాడుతూ మీకు చివరి సారిగా ఎప్పుడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చిందో గుర్తుందా అని అడిగాడు. దానికి ధోనీ మాట్లాడుతూ.. " నాకెందుకు ఇప్పుడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇస్తున్నారు. నూర్ అహ్మద్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని నేను భావిస్తున్నాను. మధ్య ఓవర్లలో జడేజాతో కలిసి కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. మ్యాచ్ లో ఇదే మాకు కీలక మలుపు". అని ధోనీ అన్నాడు.
ఈ మ్యాచ్ లో నూర్ అహ్మద్ తన స్పిన్ తో లక్నో జట్టును ఉక్కిరి బిక్కిరి చేశాడు. వికెట్లు తీయకపోయినా.. పొదుపుగా బౌలింగ్ చేశాడు. నాలుగు ఓవర్లలో కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చి మిడిల్ ఓవర్స్ లో లక్నోని భారీగా పరుగులు చేయకుండా కంట్రోల్ చేశాడు. ధోనీ దృష్టిలో నూర్ అహ్మద్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కు అర్హుడు అని చెప్పడం విశేషం. ధోనీ చేసిన ఈ కామెంట్స్ కు అతనిపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తుంది. తనకు ఎలాంటి అవార్డ్స్ మీద ఆసక్తి లేదని.. తన నిజాయితీని మరోసారి నిరూపించుకున్నాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే వరుసగా ఐదు ఓటములు ఎదుర్కొని డీలా పడ్డ చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు విజయాల బాట పట్టింది. ఛేజింగ్‌లో శివం దూబే (37 బాల్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 నాటౌట్)కు తోడు కెప్టెన్ ఎంఎస్ ధోనీ (11 బాల్స్‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 26 నాటౌట్) తన మార్కు ఫినిషింగ్ స్కిల్స్ చూపెట్టడంతో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే 5 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ పై విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన లక్నో 20 ఓవర్లలో 166/7 స్కోరు చేసింది. అనంతరం ఛేజింగ్‌లో చెన్నై 19.3 ఓవర్లలో 168/5 స్కోరు చేసి గెలిచింది.