IPL 2024: సూపర్ కింగ్స్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ప్రాక్టీస్ ప్రారంభించిన ధోనీ

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్​ ధోని ఐపీఎల్​ 2024 కోసం అప్పుడే ప్రాక్టీస్​ మొదలుపెట్టాడు. ధోని ఇటు టీమిండియాను, అటు ఐపీఎల్​ లో చెన్నై సూపర్​ కింగ్స్ జట్టును విజయతీరాలకు నడిపించిన విషయం తెలిసిందే. మోకాలి గాయం నుంచి కోలుకున్న కెప్టెన్ కూల్ ప్రస్తుతం ఐపీఎల్​ కోసం సన్నద్ధమవుతున్నాడు. చెన్నై జట్టుకు ఐదు సార్లు టైటిల్ అందించిన కెప్టెన్ గా ధోని ప్రత్యేక మైన గుర్తింపును సంపాధించుకున్నాడు. ఐపీఎల్​ 2024 కోసం ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించాడు.

తాజాగా రాంచీలోని జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం (జేఎస్​సీఏ)లో నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్​ గా మారింది. ఇదిలా ఉండగా.. 2023 సీజన్ తర్వాత ధోనీ ఐపీఎల్ కి గుడ్ బై చెప్పనప్పటికీ.. 2024 ఐపీఎల్ ఆడతాడా లేదా అనుమానం ఫ్యాన్స్ లో నెలకొంది. దీనికి తోడు మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకోవడంతో ఐపీఎల్ ఆడటం కష్టమే అని భావించారు.

ఈ విషయంపై  బెంగళూరులో జరిగిన కార్యక్రమానికి హాజరైన ధోనీ 2024 ఐపీఎల్ ఆడతాడని హింట్ ఇచ్చేశాడు. తాజాగా ప్రాక్టీస్ చేస్తూ కనిపించడంతో ధోనీ ఐపీఎల్ 2024 ఆడటం కన్ఫర్మ్ అయిపోయింది. 2008 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టును వదలని ధోని ఇప్పటివరకు 5 టైటిల్స్ అందించాడు. 2023 లో గుజరాత్ జయింట్స్ ను ఓడించి ఛాంపియన్ గా నిలిచిన సూపర్ కింగ్స్.. 2024 ఐపీఎల్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతుంది .