న్యూఢిల్లీ: ఎడమ మోకాలి గాయంతో బాధపడుతున్న చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ట్రీట్‌మెంట్ తీసుకునేందుకు రెడీ అవుతున్నాడు. ఈ మేరకు ముంబైలోని స్పోర్ట్స్ ఆర్థోపెడిక్స్ నిపుణులను కలవనున్నట్లు సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ బుధవారం వెల్లడించాడు. మోకాలికి పెద్ద బ్యాండేజ్‌తో ఐపీఎల్ మొత్తం కీపింగ్ చేసిన మహీ వికెట్ల మధ్య పరుగెత్తే అవసరం లేకుండా లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. ‘ఎడమ మోకాలి ఇంజ్యురీపై ధోనీ డాక్టర్ల సలహా తీసుకోనున్నాడు.
ఒకవేళ రిపోర్ట్స్‌లో సర్జరీ అవసరమని తేలితే ఏం చేయాలనేది కూడా అతనే నిర్ణయించుకుంటాడు. ఇందులో ఎవరి ప్రమేయం లేదు. అన్ని విషయాలు ధోనీకి బాగా తెలుసు’ అని విశ్వనాథన్ పేర్కొన్నాడు. వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడాలా? వద్దా? అనేది ధోనీయే డిసైడ్ చేస్తారన్నాడు. ఇప్పటికైతే అతని రిటైర్మెంట్, మినీ వేలం గురించి ఎలాంటి చర్చలు చేయలేదన్నాడు. అలాంటి ఆలోచనలు కూడా తమకు లేవని స్పష్టం చేశాడు.