భిక్కనూరు, వెలుగు: భిక్కనూరు మండలంలోని ఎంఏస్ఎన్ ఫార్మా కంపెనీని మూడు గ్రామాల ప్రజలు మంగళవారం ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంపెనీ నుంచి వెలువడుతున్న వ్యర్థాలతో తాగు నీరు కలుషితమై రోగాల పాలవుతున్నామన్నారు. కంపెనీని మూసివేయాలని 59రోజులుగా కాచాపూర్,అయ్యవారిపల్లి,పెద్దమల్లారెడ్డి గ్రామల ప్రజలు నిరవధిక దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో మంగళవారం వచ్చి సమస్యను పరిష్కరిస్తామని కంపెనీ యాజమాన్యం హామీ ఇచ్చింది. అయితే ఎవరూ రాకపోవడంతో గ్రామస్తులందరూ కలిసి కంపెనీని ముట్టడించారు. కామారెడ్డి డీఎస్పీ అనోన్య ప్రజలకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా వినకపోవడంతో కంపెనీ యాజమాన్యంతో మాట్లాడారు.20రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ప్రజలు శాంతించి వెనుదిరిగారు.