- ఈ నెల16 లోపు పెయింటింగ్ వర్క్స్ తో పూర్తి
- ఈ సారి శ్రీ దశ మహా విద్యా గణపతిగా దర్శనం
- రెండ్రోజుల ముందే దర్శనానికి భక్తులకు చాన్స్
హైదరాబాద్, వెలుగు: వినాయక చవితి వచ్చిందంటే ఖైరతాబాద్ బడా గణేశ్.. స్పెషల్ అట్రాక్షన్. తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్‌లో ఏర్పాటు చేసే మహా గణపతి విగ్రహం ట్రెండింగ్‌గా నిలుస్తుంది. విఘ్నాధిపతిగా తొలి పూజ అందుకునే గణపయ్యను వాడవాడలా ఘనంగా పూజించే వేడుకకు మరో నాలుగు రోజులే మిగిలి ఉంది. గతేడాది 58 అడుగుల ఎత్తులో దర్శనమిచ్చిన ఖైరతాబాద్ బడా గణపతి ఈసారి 63 అడుగుల ఎత్తులో రూపుదిద్దుకుంది.
ప్రస్తుతం విగ్రహం పనులు తుది దశకు చేరగా.. పెయింటింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది నవరాత్రి వేడుకలకు శ్రీ దశ మహా విద్యా గణపతిగా గణనాథుడు ఖైరతాబాద్ బడా గణేశ్ దర్శనమివ్వనున్నారు. గతేడాది నుంచి పర్యావరణహితంగా నిర్మిస్తుండగా.. ఈసారి పూర్తిగా మట్టితో తయారు చేశారు.
ఈ ఏడాది 69 సారి ఏర్పాటు చేస్తుండగా.. వచ్చే ఏడాదికి 70 ఏండ్లు అవుతుండగా అన్ని అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయనున్నట్లు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ కన్వీనర్ సందీప్ రాజు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్నిశాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రతి షిఫ్ట్‌లో పోలీసులతో పాటు 200 మంది వలంటీర్లు ఉండనున్నట్లు చెప్పారు.
ALSO READ:రాజకీయాల్లో గౌడ్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి
విగ్రహ రూపకర్తలు వీరే..
బడా గణపతిని వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు తయారు చేసే పనిలో నిమగ్నమవుతారు. ఇందులో భాగంగా విగ్రహ డిజైన్ హైదరాబాద్‌కు చెందిన సి. రాజేందర్, నమూనా ప్రింట్ పనులు నల్లనాగుల శరత్ 30 ఏండ్లుగా చేస్తున్నారు. వెల్డింగ్ వర్క్ మచిలీపట్నానికి చెందిన నాగబాబు బృందం, మట్టి పనులను ఒడిశాకు చెందిన మట్టి కళాకారుడు జోగారావు టీమ్ చూస్తుంది. చైన్నైకి చెందిన కళాకారుడు మూర్తి విగ్రహం డిజైన్ చేశారు.