- అక్రమంగా సాగుతున్న తవ్వకాలు
- చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్న ఆఫీసర్లు
- రిజర్వ్ఫారెస్ట్నూ వదలని దళారులు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లాలో మట్టి మాఫియా అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. వారి ఆగడాలు ‘మూడు ట్రాక్టర్లు.. ఆరు టిప్పర్లు’ అన్న చందంగా మట్టి అక్రమ దందా జిల్లాలో పెద్ద ఎత్తున సాగుతోంది. రిజర్వ్ఫారెస్ట్తోపాటు ప్రభుత్వ భూముల్లో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుగుతున్నా ఆఫీసర్లు మాత్రం తమ దృష్టికి రాలేదంటూ సాకులు చెబుతూ తప్పించుకుంటున్నారు. మట్టి, రాళ్ల దందా గుట్టలకు గుట్టలు మాయమవుతున్నాయి. అడవిలో వంట చెరకు, ఇంటి అవసరాల కోసం చిన్న చెట్టును నరికినా కేసులు పెట్టే ఫారెస్ట్ఆఫీసర్లు రిజర్వ్‌ఫారెస్ట్ లో అక్రమంగా మట్టి తవ్వకాలు విచ్చలవిడిగా సాగుతున్నా వారి దృష్టికి రాకపోవడం గమనార్హం.
పేలుళ్లు ఉపయోగించీ తవ్వకాలు...
పాల్వంచ మెయిన్‌రోడ్డు నుంచి మైలారం వెళ్లే దారిలోని రోడ్డుకిరువైపులా పలు ప్రాంతాల్లోని రిజర్వ్ ఫారెస్ట్ లోనూ మొరం, మట్టి తవ్వకాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. కొత్తగూడెం నుంచి హేమచంద్రాపురం వెళ్లే దారిలోని ఓ గుట్టను జేసీబీలో తవ్వేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో పేలుళ్లు ఉపయోగించి తవ్వకాలు చేస్తున్నా ఆఫీసర్లు అటువైపు వెళ్లి పరిశీలించే సాహసం చేయడంలేదు. పాల్వంచలోని తోగ్గూడెం ప్రాంతంలోనూ పెద్ద ఎత్తున అక్రమ మట్టి దందా కొనసాగుతోంది. కొత్తగూడెం నుంచి పాల్వంచ బైపాస్‌రోడ్డు కోసం మట్టిమాఫియా, కాంట్రాక్టర్లు ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ఇటీవలే దాదాపు 200 ట్రిప్పుల టిప్పర్లతో మట్టిని అక్రమంగా తవ్వి తరలించారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని ఇటుక బట్టీలు నడుపుతున్న వ్యాపారులు పెద్ద ఎత్తున అక్రమ మట్టి తవ్వకాలు చేపడుతున్నా ఆఫీసర్లు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండడం సర్వత్రా చర్చానీయాంశంగా మారింది. చుంచుపల్లి, సుజాతనగర్, జూలూరుపాడు, పాల్వంచ మండలాల్లోనూ ఫారెస్ట్, గవర్నమెంట్ భూముల్లో ఈ మట్టి దందా భారీ ఎత్తున సాగుతోంది. అనుమతి లేకుండా మట్టి తవ్వకాలు చేసే వారిపై కేసులు నమోదు చేయాలని పలుమార్లు కలెక్టర్ అనుదీప్ఆదేశించినా ఆయన మాటలను అధికారులు బేఖాతరు చేస్తున్నారు. అడపాదడపా కొన్ని ట్రాక్టర్లను పట్టుకొని కేసులు పెట్టి చేతులు దులుపుకుంటున్నారు.
రాకపోకలకు ప్రత్యేక దారులు...
లక్ష్మీదేవిపల్లి మండలంలోని గట్టుమల్ల రిజర్వ్‌ఫారెస్ట్ లో కొంతకాలంగా పెద్ద ఎత్తున అక్రమ మట్టి తవ్వకాలు కొనసాగుతున్నాయి. అందుకు రెవెన్యూ ఆఫీసర్ల అనుమతులు లేకుండానే కొందరు దళారులు కాంట్రాక్టర్లతో కుమ్ముక్కై ఈ మట్టి దందాను కొనసాగిస్తున్నారు. రిజర్వ్‌ఫారెస్ట్‌లో జేసీబీలతో గుట్టలను తవ్వుతూ అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. అందుకు వాహనాల రాకపోకల కోసం అడవిలో ప్రత్యేక దారులు కూడా ఏర్పాటు చేసుకున్నారు. తాము మట్టి తవ్వకాలు చేయని టైంలో ఆ ప్రాంతానికి ఎవరూ రాకుండా ముళ్ల కంచేతో రోడ్డును బ్లాక్చేస్తూ దందా సాగిస్తున్నారు. ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా పెద్ద ఎత్తున మట్టిని తరలిస్తూ అమ్మకాలు సాగిస్తున్నారు. దాదాపు రోజుకు 400 ట్రిప్పులకు పైగా మట్టిని రిజర్వ్ఫారెస్ట్నుంచి ఇల్లీగల్ కాంట్రాక్టర్లు తరలించినప్పటికీ ఆఫీసర్లు మాత్రం పట్టించుకోవడంలేదు.