వదలని బురద.. వెలగని పొయ్యి!

వదలని బురద.. వెలగని పొయ్యి!
  • ఖమ్మం వరద ముంపు ప్రాంతాల్లో ఇదీ పరిస్థితి 
  •     6 రోజులుగా కొనసాగుతున్న సహాయ చర్యలు
  •     ఇంకా పూర్తిగా కోలుకోని ముంపు కాలనీలు
  •     సాధారణ స్థితికి చేరుకోని బాధిత కుటుంబాలు 
  •     పొంచి ఉన్న  ఇన్ఫెక్షన్లు, అంటువ్యాధులు
  •     ఈసారి కనిపించని వినాయక చవితి సందడి

ఖమ్మం, వెలుగు :  మున్నేరు వరద బీభత్సం నుంచి ముంపు కాలనీల ప్రజలు ఇంకా సాధారణ స్థితికి చేరుకోలేకపోతున్నారు. వారం రోజులుగా బాధితులు ఇండ్లలో పొయ్యి ముట్టించలేకపోతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిలీఫ్ కేంద్రాలు, దాతల సాయంపైనే ఆధారపడి ఉన్నారు. వరద కారణంగా ఇంట్లోని సామాన్లు, బట్టలు, విలువైన కాగితాలు తడిసి ముద్దయ్యాయి. బర్రెలు, ఆవులు, మేకలు, గొర్రెలు, కుక్కలు, కోళ్లు కూడా చనిపోయాయి. పొద్దంతా ఇండ్ల క్లీన్ చేసుకుంటూ.. వస్తువులు, బట్టలను ఆరబెట్టుకుంటు న్నారు. రాత్రిపూట రిలీఫ్ క్యాంపుల్లో తలదాచుకుంటున్నారు. ఆరు రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నా.. పూర్తిస్థాయిలో బాధితులు రోజువారీ జీవనానికి అలవాటుపడలేకపోతున్నారు. ఖమ్మం సిటీలోని వెంకటేశ్వరనగర్, బొక్కలగడ్డ, కరుణగిరి, పద్మావతి నగర్, మోతీనగర్, మంచికంటి నగర్, గొల్లబజార్, ప్రకాశ్ నగర్, శ్రీనివాసనగర్, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కాలనీ, సాయికృష్ణా నగర్, సాయి ప్రభాత్ నగర్, వికలాంగుల కాలనీ తదితర ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయి. ఖమ్మం, పాలేరు సెగ్మెంట్లలో దాదాపు 50 కాలనీల్లోని 8 వేల మంది నిరాశ్రయులయ్యారు. నష్టపోయిన వారంతా రోజువారీ కూలీలు, దిగువ మధ్య తరగతి వారే కావడంతో ఒక్క రోజు వరదతో తమ జీవితమే తలకిందులైందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

పండుగ సందడే లేదు 

వేల కుటుంబాలు వరద ముంపు బారిన పడితీవ్రంగా కట్టుబట్టలతో మిగిలి తీవ్రంగా నష్టపోయాయి. దీంతో ఈసారి వినాయక చవితి సందడి కనిపించడం లేదు. గతేడాది ప్రతి వీధికో విగ్రహం ఏర్పాటు చేసుకోగా..  ప్రస్తుతం ఆ ఊసే లేదు. ప్రతిసారి గణేశ్ నవరాత్రి ఉత్సవాలకు చందాలు ఇచ్చినట్లుగా..ఈసారి ఆ మొత్తాన్ని వరద బాధితులకు నిత్యావసరాలు అందించేందుకు, భోజన ఏర్పాట్లకు ఖర్చు చేస్తున్నారు. 

పొంచి ఉన్న ఇన్ఫెక్షన్ల ముప్పు 

వేల మంది వరద బాధితులు, వందల మంది శానిటేషన్ సిబ్బంది ఆరు రోజులుగా శ్రమిస్తున్నారు. ముంపునకు గురైన కాలనీల్లో మొదటి రెండు రోజులు నీళ్లు నిలిచి ఉన్నాయి. ఆ తర్వాత వరద తగ్గినా ఇండ్లలో బురద నిండి ఉండడంతో  డోజర్లు, ట్రాక్టర్లు, జేసీబీలతో క్లీన్ చేసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు చెత్తను తరలిస్తున్నా ఇంకా పూర్తిస్థాయిలో తొలగిపోలేదు. గొల్ల బజార్, మంచికంటి నగర్ లో మున్నేరుకు ఆనుకొని ఉన్న బజార్లలో ఇంకా బురద కనిపిస్తోంది. 
అంటువ్యాధులు, ఇన్ఫెక్షన్ల ముప్పు పొంచి ఉంది.  కరుణగిరి ఏరియాలో చెత్తా చెదారం తొలగింపు కంప్లీట్ కాకపోవడంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులపై సీరియస్ అయ్యారు. క్లీనింగ్ కంప్లీట్ చేసి, ఇన్ఫెక్షన్లు రాకుండా వెంటనే బ్లీచింగ్ పౌడర్ చల్లించాలని, ఖాళీప్లాట్లలో దోమలు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 60కు పైగా ప్రాంతాల్లో 805 టీమ్ లు 40,315 ఇండ్లలో ఫీవర్ సర్వే చేస్తున్నారు. ఇప్పటివరకు 38,848 మందికి వైద్య సేవలు అందించారు. 725 ఫీవర్, 62 డయేరియా కేసులు నమోదైనట్టు, 1 కేసు సీరియస్ గా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. 20 రిలీఫ్ క్యాంపుల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి5 ప్రత్యేక మొబైల్ టీమ్ లు వైద్యసేవలతో పాటు మెడిసిన్ 
అందిస్తున్నాయి.