- చెరువుల్లో రైతులకు పర్మిషన్లిస్తే వెంచర్లకు తరలింపు
- అడవులు, పోడు భూముల్లోని మట్టి గుట్టలు మాయం
- ఆఫీసర్లకు ఫిర్యాదు చేసినా ఆగని దందా
ఖమ్మం జిల్లాలో అక్రమార్కుల మట్టి దందాకు అడ్డుకట్ట పడడం లేదు. అనుమతులకు మించి కొండలను కొందరు గుల్ల చేస్తుంటే.. రైతులకు ఇచ్చిన పర్మిషన్లను అడ్డం పెట్టుకొని మరికొందరు చెరువు మట్టిని ఇటుక బట్టీలు, వాణిజ్య అవసరాలకు తరలిస్తున్నారు. అడవులు, పోడు భూముల్లోని మట్టి గుట్టలను సైతం అక్రమార్కులు వదిలిపెట్టడం లేదు.
ఖమ్మం, వెలుగు : జిల్లాలో ప్రస్తుతం మూడు మైనింగ్ క్వారీలకు మట్టి తవ్వకాలకు అనుమతి ఉంది. వేసవిలో 29 చెరువుల్లో స్వరూపం దెబ్బతినకుండా సమాంతరంగా ఉదయం వేళల్లో మాత్రమే మట్టి తోలుకోవాలంటూ రైతులకు ఆఫీసర్లు పర్మిషన్లు ఇచ్చారు. మండల స్థాయిలో ఆఫీసర్లను మేనేజ్చేస్తూ.. పగలు, రాత్రి అన్న తేడా లేకుండా యథేచ్ఛగా మట్టి దందా కొనసాగుతోంది. నగరాలు, పట్టణాల్లోని ప్లాట్లు, వెంచర్లకు మట్టి డిమాండ్ ఉండడంతో..
ట్రాక్టర్ కు రూ.800 నుంచి వెయ్యి వరకు, టిప్పర్ కు రూ.3500 నుంచి 5 వేల వరకు అమ్ముతున్నారు. పోడు పట్టాలున్న రైతులు తమ భూములను చదును చేసుకోవడానికి ప్రయత్నిస్తుండడంతో.. దీన్ని ఆసరాగా తీసుకొని దళారులు మట్టిని ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటున్నారు.
అక్రమ తవ్వకాలిలా...!
- కొణిజర్ల మండలంలో ఇప్పటికే 80 ఎకరాల్లో ఉన్న మట్టి గుట్టలను చదును చేశారు. రామనర్సయ్య నగర్, సాలెబంజర, క్రాంతినగర్, లక్ష్మీపురం వరకు ఉన్న అడవి పరిధిలోని చిన్నచిన్న మట్టి గుట్టలను కొందరు గుల్ల చేస్తున్నారు. డోజర్లు, జేసీబీలను అద్దెకు తీసుకొని అటవీ ప్రాంతంలో ఐదెకరాల నుంచి 20 ఎకరాల వరకు ఉన్న గుట్టలను చదును చేస్తూ మట్టిని అమ్ముకుంటున్నారు. పోడు హక్కు పత్రాలున్నాయంటూ ఈ రకం దందాకు తెరలేపారు. వైరా నియోజకవర్గానికి చెందిన ఒక లీడర్ సపోర్ట్ ఉండడంతో ఆఫీసర్లు కూడా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
- ఖమ్మం అర్బన్ మండలం గొల్లగూడెం చెరువులో ఇటీవల అర్ధరాత్రి వరకు మట్టి తోలకం చేస్తుండడంతో స్థానికులకు ఆఫీసర్లకు కంప్లైంట్ చేశారు. ఇరిగేషన్అధికారులు అక్కడికి చేరుకోవడంతో నిందితులు పరారయ్యారు.
- పెనుబల్లి మండలం లింగగూడెం రెవెన్యూ పరిధిలోని చిలకలగుట్టలో తెల్లరాళ్ల తవ్వకాల కోసం మైనింగ్ శాఖ నుంచి అనుమతి పొందిన ఓ ప్రైవేట్ సంస్థ మట్టిని తవ్వి ఆంధ్రకు తరలించింది. స్థానిక గిరిజనులు మైనింగ్ శాఖ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
- ముదిగొండతోపాటు మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఇటీవల చెరువులో మట్టి తోలకాలు జరిగాయి. రైతులు ఎకరానికి గరిష్ఠంగా 30 ట్రిప్పులు మాత్రమే తోలుకునేందుకు ఆఫీసర్లు పర్మిషన్ ఇచ్చారు. కానీ, అదే పర్మిషన్ తో వందల ట్రిప్పుల మట్టి తోలకాలు జరిపారు. కొందరు రైతుల పేరుతో ఇటుక బట్టిలకు, వెంచర్లలకు, మామిటి తోటలకు తోలకాలు జరిపారు.
- ఖమ్మం రూరల్మండలం ఎదులాపురం చెరువులో ఇటీవల మట్టి తోలకాలు జరిగాయి. పది జేసీబీలు, టిప్పర్లు, ట్రాక్టర్లతో పగలు, రాత్రి తేడా లేకుండా తవ్వకాలు జరిపారు. రైతుల పేరుతో పర్మిషన్ తీసుకుని వెంచర్లకు, ఇండ్లకు తోలుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.
- వైరాలోని వైరా రిజర్వాయర్, సోమవరంలోని నల్లచెరువులోని మట్టితోలకాలు జరుగుతున్నాయి. రైతులు తమ పొలాలకు పర్మిషన్ తీసుకొని పొలాలకు తోలుకుంటున్నారు. కానీ కొంతమంది జేసీబీ నిర్వాహకులు ట్రాక్టర్ల ద్వారా వెంచర్లకు, గ్రామాల్లోని ఖాళీ స్థలాలకు మట్టిని తరలిస్తున్నారు.
- కామేపల్లి మండలంలో చెరువు మట్టిని ఇటుకబట్టిలకు తరలిస్తున్నారు. పండితాపురంలో కొండారెడ్డి చెరువు, చాకరేయికుంట, ముత్యాలమ్మ కుంట చెరువుల్లో మొన్నటి వరకు బీఆర్ఎస్ లో ఉన్న మండల స్థాయి నేత అధికారం అడ్డుపెట్టుకొని మట్టి తోలకాలు నిర్వహించారు. ఆయన ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు ఆయన కొందరు రైతుల పేరుతో పర్మిషన్ తీసుకొని వారి పొలాలకు మట్టితోలకుండా ఇటుక బట్టీలకు తోలుతున్నారు.
- కూసుమంచి మండలంలో ఎటువంటి అనుమతులు లేకుండా జుజ్జల్ రావుపేట, గట్టుసింగారం, తురకగూడెం, కూసుమంచిలో చెరువుల నుంచి గృహాలకు జేసీబీ యాజమానులు మట్టి తోలుతున్నారు. ట్రక్కుకు రూ.650 నుంచి రూ.800 వరకు తీసుకుంటున్నారు. మామూళ్ల మత్తులో రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి.
- తల్లాడ గుంటి చెరువులో దాదాపు 20 రోజుల నుండి మట్టి తోలకాలు జరుగుతున్నాయి. రైతులు తమ పొలాలకు చెరువు మట్టి అవసరమై పర్మిషన్ తీసుకొని చెరువు మట్టి తోలకాలు నిర్వహిస్తున్నారు. జేసీబీ నిర్వాహకులు ప్రైవేటుగా మట్టి తోలకాలు జరిపి డబ్బులు దండుకుంటున్నారు.
- మధిర మండలం సిరిపురం సమీపంలోని ఎండవల్లి గుట్టలు క్రమంగా కరిగిపోతున్నాయి. ప్రభుత్వ స్థలాల్లోని కొండలను తవ్వి, అక్కడి నుంచి ఎర్రమట్టి తరలిస్తున్నారు. ఎండవల్లి గుట్ట సర్వే నంబర్ 61, 62, 73 లో దాదాపు 250 ఎకరాల్లో ప్రభుత్వ, అటవీ భూములు ఉన్నాయి. ప్రభుత్వ భూములకు సరిహద్దులు లేకపోవడంతో, అక్కడ ఎటువంటి అనుమతులు లేకుండానే మట్టి తోలకాలు చేస్తున్నారు. దీనిపై ఆఫీసర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
- కల్లూరు మండలంలో చిన్న కోరుకొండి, చెన్నూరు, చండ్రుపట్ల, వెన్నవల్లి, లక్ష్మీపురం గ్రామాల్లో చెరువు మట్టిని ప్రైవేటు వ్యక్తులు అమ్ముకున్నారు. ఏపీకి చెందిన రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా మట్టిని తరలించారు. బత్తులపల్లి గ్రామ సమీపంలోని రెండు పెద్ద ఇటుక బట్టీలకు సుమారు 800 టిప్పర్ల వరకు మట్టి డంపింగ్ జరిగింది.