సిద్ధరామయ్యకు క్లీన్ చిట్: ఆయనకు వ్యతిరేకంగా ఆధారాల్లేవన్న లోకాయుక్త

సిద్ధరామయ్యకు క్లీన్ చిట్: ఆయనకు వ్యతిరేకంగా ఆధారాల్లేవన్న లోకాయుక్త
  • ముడా స్కామ్ కేసులో కర్నాటక సీఎంకు రిలీఫ్

బెంగళూర్ : ముడా ల్యాండ్ స్కామ్ కేసులో కర్నాటక సీఎం సిద్ధరామయ్యకు బిగ్ రిలీఫ్ లభించింది. ఈ కేసులో ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాల్లేవని లోకాయుక్త వెల్లడించింది. ఈమేరకు ఫిర్యాదుదారు, సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణకు బుధవారం లేఖ రాసింది. ‘‘సరైన ఆధారాలులేని కారణంగా ముడా ల్యాండ్ స్కామ్ కేసులో ఏ1, ఏ2, ఏ3, ఏ4లపై వచ్చిన ఆరోపణలు నిరూపితం కాలేదు. ఈ కేసులో సీఎం సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామి, మరో నిందితుడు దేవరాజుకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాల్లేవు. 

అంతేకాకుండా సిద్ధరామయ్యపై వచ్చిన ఆరోపణలు సివిల్ కిందికి వస్తాయి” అని లేఖలో లోకాయుక్త పోలీసులు పేర్కొన్నారు. దీనిపై తన అభ్యంతరాలు తెలిపేందుకు కృష్ణకు వారం రోజుల గడువు ఇచ్చారు. ఆ తర్వాత తుది నివేదికను హైకోర్టుకు అందజేస్తామని తెలిపారు. తదుపరి విచారణ కొనసాగుతుందన్నారు. కాగా, ముడా ల్యాండ్ స్కామ్ కేసులో సీఎం సిద్ధరామయ్య హస్తం కూడా ఉందని, ఆయనను విచారించాలని కృష్ణ సహా ముగ్గురు సామాజిక కార్యకర్తలు గవర్నర్ కు లెటర్ రాశారు. గవర్నర్ అనుమతితో లోకాయుక్త పోలీసులు విచారణ చేపట్టారు.

ఏంటీ ముడా స్కామ్? 

మైసూర్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (ముడా) 2016 నుంచి 2024 మధ్య తాము సేకరించిన భూములకు పరిహారంగా నిర్వాసితులకు వేరే చోట భూములను కేటాయించింది. వీరిలో సిద్ధరామయ్య భార్య పార్వతి కూడా ఉన్నారు. మైసూర్ సిటీ శివార్లలో ఆమె  భూమిని సేకరించిన ముడా.. దానికి పరిహారంగా మైసూర్​కు దగ్గర్లో ఖరీదైన ప్రాంతంలో భూమిని కేటాయించింది. అప్పుడు సిద్ధరామయ్యనే సీఎంగా ఉన్నారు. అయితే ఈ భూముల కేటాయింపులో అవకతవకలు జరిగాయని సామాజిక కార్యకర్తలు ఫిర్యాదు చేశారు.