మహబూబ్‌నగర్, వెలుగు: మహబూబ్‌నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) డైరెక్టర్ల పదవులు షో పుటప్గా మారాయి. బాధ్యతలు తీసుకొని ఏడాది కావస్తున్నా, ఇప్పటి వరకు తమను గుర్తించడం లేదని స్వయంగా డైరెక్టర్లే నియోజకవర్గ లీడర్లు, సన్నిహితుల వద్ద వాపోతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే, వచ్చే నెలలో పదవులకు రాజీమానా చేసేందుకు సిద్ధమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది.
ఉత్సవ విగ్రహాలుగా డైరెక్టర్లు..
మహబూబ్‌నగర్‌ను అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా గుర్తించాలని 2020 అక్టోబర్‌లో అప్పటి కలెక్టర్ ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపగా, గత ఏడాది ఏప్రిల్ 4న ‘ముడా’ను గుర్తిస్తూ జీవో 26ను జారీ చేశారు. 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్న మహబూబ్‌నగర్, జడ్చర్ల, భూత్పూర్ మున్సిపాల్టీలతో పాటు 12 మండలాలు, 140కి పైగా గ్రామాలను ఇందులో చేర్చారు. అదే రోజు పాలకవర్గాన్ని నియమిస్తున్నట్లు ప్రకటించి చైర్మన్, వైస్ చైర్మన్, 15 డైరెక్టర్ పోస్టులను మంజూరు చేశారు. వైస్‌చైర్మన్‌గా మహబూబ్‌నగర్ మున్సిపల్ కమిషనర్ వ్యవహరించనుండగా, మిగతా పోస్టులను రూలింగ్ పార్టీ పెద్దలు ఫిలప్ చేశారు. వీరంతా గత ఏడాది జులై 30న బాధ్యతలు స్వీకరించారు. ఒక్కో డైరెక్టర్ ఎంపీపీ, జడ్పీటీసీలతో సమానమని, వారికున్నట్లుగానే ప్రొటోకాల్ ఉంటుందని చెప్పినట్లు సమాచారం. కానీ బాధ్యతలు తీసుకొని ఏడాది కావొస్తున్నా, ఇంత వరకు ప్రయారిటీ ఇవ్వడం లేదని డైరెక్టర్లు అసంతృప్తితో ఉన్నారు.
సీఎంను కలవాలని ప్రయత్నించినా..
గత ఏడాది డిసెంబరు 4న మహబూబ్‌నగర్ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ఓపెనింగ్‌కు వచ్చిన సీఎంను కలిసి తమకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదనే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లాలని భావించినా, సీఎంను కలిసే అవకాశం రాలేదు. ఇటీవల మంత్రి కేటీఆర్ మహబూబ్‌నగర్, దేవరకద్ర, జడ్చర్ల ప్రాంతాల్లో పర్యటించినా, ముడా గురించి ప్రస్తావించకపోవడంతో పాటు డైరెక్టర్ల గురించి మాట్లాడకపోవడంతో వీరు మరింత నిరుత్సాహానికి గురయ్యారు. జూన్ 2న ఆఫీస్‌లో జెండా పండుగ కార్యక్రమానికి ఆహ్వానించినా కొందరు డైరెక్టర్లు బైకాట్ చేసినట్లు సమాచారం.
రాజీనామాలు చేసేందుకు రెడీ..
బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జెండా పండుగలకు తప్ప, ఇతర ఏ కార్యక్రమాల్లో ప్రయారిటీ ఇవ్వడం లేదని కొందరు డైరెక్టర్లు అసంతృప్తితో ఉన్నారు. బాధ్యతలు తీసుకున్న మూడు నెలల తర్వాత ఓ సమావేశం నిర్వహించగా, అందులో డైరెక్టర్లు తమ విధులు, నిధుల గురించి ప్రస్తావించినట్లు సమాచారం. అయితే, మీ పరిధిలో ఏమీ ఉండదని, లే అవుట్ అప్రూవల్ ఇతర అనుమతుల్లో ఓ జిల్లా స్థాయి ఆఫీసర్కే పవర్ ఉంటుందని చెప్పి సమావేశాన్ని ముగించినట్లు తెలిసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తిరిగి సమావేశం కూడా నిర్వహించలేదని డైరెక్టర్లు చెబుతున్నారు. అలాంటప్పుడు తమకు ఈ పదవులు ఎందుకిచ్చారని కొందరు డైరెక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 30తో బాధ్యతలు చేపట్టి ఏడాది అవుతుందని, త్వరలో పదవులకు రాజీనామాలు చేస్తామని రెండు నియోజకవర్గాలకు చెందిన డైరెక్టర్లు చెబుతున్నారు. మరో నియోజకవర్గానికి చెందిన లీడర్లు మాత్రం ఈ విషయాన్ని ఇప్పటికే తమ నియోజకవర్గాల బాస్‌లకు చెప్పామని అంటున్నారు.
ఫండ్స్ వినియోగంపై చర్చ..
వివిధ పర్మిషన్ల ద్వారా ముడాకు రూ.25 కోట్లు జమ అయినట్లు తెలిసింది. ఈ ఫండ్స్‌ను డెవలప్మెంట్ కోసం ఖర్చు చేయాల్సి ఉంది. వీటి వినియోగంపై కొద్ది రోజుల కింద జిల్లాకు చెందిన ముగ్గురు లీడర్ల మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. ఏఏ నియోజకవర్గాల నుంచి ఎంత జమ అయ్యిందో, అంత మొత్తాన్ని ఆయా నియోజకవర్గాల అభివృద్ధికి కేటాయించాలని ఇద్దరు లీడర్లు ప్రతిపాదించగా, మరో లీడర్ మాత్రం ఈ ప్రపోజల్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం.