బురదపాలైన జానపద కళా సంపద.. నీటమునిగిన ఓరుగల్లు జానపద విజ్ఞాన పీఠం

  • భుజాల్లోతు నీటిలో అరుదైన వస్తువులు
  • పూర్తిస్థాయి మ్యూజియం  ఏర్పాటులో సర్కారు అశ్రద్ధ 
  • కండ్ల ముందే కనుమరుగవుతున్న ఎన్కటి వస్తుసామగ్రి

వరంగల్, వెలుగు: ‘‘ఎన్కటి కాలంలో జానపద కళాకారులు వాడిన చిరుతలు, తాంబుర్ర, జమిడిక, తబల, జేగంట.. చరిత్రను చెప్పే తాళగ్రంథాలు.. కుల వృత్తుల్లో భాగంగా వాడిన కుమ్మరోళ్ల సలపలు, సారె పట్టం.. కమ్మరోళ్ల  దూగోడ, తిత్తి.. గోల్లోళ్ల దొడ్డు కర్రలు, గొంగళ్లు.. గౌండ్లొళ్ల  గీసకత్తి, గుజి, ముత్తాదు.. మంగలోళ్ల కత్తులు, కల్పలు.. మాదిగల డప్పు కుదురు, పన్రాయి, గూటం..  బెస్తొళ్ల ఏతోల, చేపల బుట్టలు.. పద్మశాలీల అచ్చు కర్రలు, దోనుగ, కుంచె, నాడే.. పెళ్లి బరాత్‍లో పెండ్లి కొడుకు, పెండ్లిపిల్ల కూసునే పల్లకీ..” ఇలా నేటి తరానికి తెలియని మన తాత ముత్తాతలు వాడిన వందలాది అరుదైన పనిముట్లు, వస్తువులివి.  కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినా దొరకని అరుదైన సంపద వరదల వల్ల భావితరాలకు దక్కకుండా పోయాయి. అరుదుగా దొరికే నాటి వస్తువులను పరిశోధకులు ఒక్కొక్కటిగా సేకరించి తీసుకొచ్చిన క్రమంలో.. పూర్తిస్థాయి మ్యూజియం ఏర్పాటుకు రాష్ట్ర సర్కారు సరైన రీతిలో చేయూత ఇవ్వకపోవడంతో వారసత్వ సంపద బురదలో నాశనమైంది.

1995లో వరంగల్‍కు దక్కిన పీఠం 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‍లో  పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుంచి వరంగల్​లో జానపద గిరిజన విజ్ఞాన పీఠం ఏర్పాటు చేశారు. అంతరించిపోతున్న జానపద కళాకారులకు ప్రోత్సాహం అందించడం.. నాటి కళాకారుల ప్రదర్శనలు, చరిత్ర, వాయిద్యాలు,  పూర్వీకులు, గిరిజనులు వాడిన పనిముట్లు.. మొత్తంగా నాటి జీవనశైలి ఎలా ఉండేదో భావితరాలకు అందించేలా ఎప్పటికప్పుడు పరిశోధనలు చేశారు. 

అరుదుగా దొరికే వస్తువులను సేకరించారు. తెలంగాణ ప్రాంతం జానపదాలకు కేరాఫ్​గా ఉండడంతో విశాఖపట్టణంతో పాటు 1995లో వరంగల్​లో మరో విజ్ఞాన పీఠాన్ని ఏర్పాటు చేశారు. మొదట హనుమకొండలో ప్రస్తుత రంగ్‍ బార్‍ కాలనీలో.. ఆపై సుబేదారిలోని గంప పెద్దన్న షాప్‍ గల్లీలో అద్దె ఇండ్లల్లో ఉన్న పీఠానికి పర్మినెంట్‍ బిల్డింగ్‍ కోసం హంటర్​రోడ్‍లోని ప్రస్తుత భద్రకాళి బండ్‍ ను ఆనుకుని ఉన్న స్థలాన్ని కేటాయించారు. 1999 జులై 1న నాటి సీఎం నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. నిర్మాణం అనంతరం అప్పటినుంచి ఇక్కడే కొనసాగుతోంది. 

బురద కూపంలో విలువైన సంపద
గిరిజన విజ్ఞాన పీఠం ఏర్పాటు తర్వాత సిబ్బంది తెలుగు రాష్ట్రాల్లో జానపద, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, వృత్తులపై పరిశోధనలు చేశారు. ఆదిలాబాద్‍, నిర్మల్‍, విశాఖపట్టణం, ఆదిలాబాద్‍, మేడారం, పశ్చిమ గోదావరి వంటి ఎన్నో జిల్లాల్లో అరుదుగా దొరికే వాయిద్యాలు, వస్తువులు, పనిముట్లను సేకరించారు.  సీడీలు, క్యాసెట్లు, ఫొటోల రూపంలో వాటి చరిత్ర, ప్రదర్శనలు రికార్డ్​ చేసి పెట్టారు.  మన పూర్వీకులు ఎలా ఉండేవారో.. ఏ పనులు ఎలా చేసేవారో కండ్లకు కట్టినట్లు సేకరించి పీఠంలో కిందనే ప్రదర్శనకు పెట్టారు. 
 
కల్చరల్‍ హబ్‍ను పట్టించుకోని సర్కార్‍
 ప్రత్యేక రాష్ట్రంలో పీఠాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఏనాడూ  పట్టించుకోలేదు. శాలిని మిశ్రా కలెక్టర్​గా ఉన్న  టైంలో విజ్ఞాన పీఠాన్ని డెవలప్‍ చేయ డానికి 4 ఎకరాల 18 గుంటల భూమి కేటాయించారు. భవిష్యత్‍లో బండ్‍ ఏర్పాటు చేస్తే దీనికి కనెక్టివిటీగా వీకెండ్స్​లో పీఠంలో కల్చరల్‍ ప్రొగ్రాంలు చేయడం ద్వారా కల్చరల్‍ హబ్‍  చేయాలని చెప్పారు. ఈ క్రమంలో భద్రకాళి బండ్‍ నిర్మాణ టైంలో పీఠానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన ఆఫీసర్లు అర ఎకరం కంటే ఎక్కువ భూమిని దాటుకుని వచ్చి నిర్మాణాలు చేశారు. పరిశోధనలు చేసే క్రమంలో మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఫండ్స్​, పరికరాలు ఇవ్వలేదు. కనీసం బండ్‍ కు వచ్చే టూరిస్టులకు ఇలాంటి వారసత్వ సంపదను చూపాల్సి ఉండగా.. మధ్యలో గోడకట్టి అటు వైపు ఎవరూ వెళ్లకుండా చేశారు. పీఠంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్​ బోధన, బోధనేతర, టైం స్కేల్‍, ఔట్‍సోర్సింగ్‍ ఉద్యోగుల బాగోగులు పట్టించుకోకపోవడంతో పలుమార్లు వారు ధర్నాలకు దిగారు.

భద్రకాళి బండ్‍ వల్లే.. 
హంటర్‍రోడ్‍ మీదుగా గతంలో  పీఠం బిల్డింగ్‍ కు వెళ్లే దారి ఉండేది. పరిశోధకులతో పాటు చరిత్రకారులు, స్టూడెంట్లు పీఠంలోని అరుదైన వస్తువులు, చరిత్ర తెలుసు కోడానికి వెళ్లేవారు. కాగా, రెండేండ్ల కింద భద్రకాళి బండ్‍ ఏర్పాటు పేరుతో పీఠం ప్రాధాన్యం తగ్గించారు. బండ్‍ చుట్టూరా సిమెంట్‍ వాల్‍ నిర్మించే క్రమంలో  పీఠాన్ని పరిగణ లోకి తీసుకోకుండా అడ్డుగోడ పెట్టారు.  దీంతో బండ్‍కు వంద అడుగుల దూరంలో ఉండే  పీఠానికి రెండు కిలోమీటర్లు తిరిగి సంతోషిమాత టెంపుల్‍ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. గతంలో వానా కాలంలో వరదలు వచ్చినా.. కేవలం బిల్డింగ్‍ మెట్ల వరకు మాత్రమే నీళ్లు వచ్చేది.  కాగా, ఏడాది కింద బండ్‍ దగ్గర ప్రహారీ కట్టడంతో బొందివాగు నాలా ఉప్పొంగి.. వరద మొత్తం పీఠం వైపు వచ్చింది. అక్కడ నీరు వెళ్లకుండా సిమెంట్  గోడ అడ్డు ఉండడంతో వరద మొత్తం వెనక్కి తన్ని జానపద గిరిజన విజ్ఞాన పీఠాన్ని ముంచేసింది..

బండ్‍ గోడతోనే పీఠంలోకి వరదొచ్చింది..
జానపద జిల్లాగా ఓరుగల్లు ప్రత్యేకత ఉన్నందునే నాడు విజ్ఞాన పీఠం ఏర్పాటు చేశారు.  రెగ్యులర్​గా కల్చరల్‍ ప్రోగ్రాంలు చేయాలని అప్పటి ఆఫీసర్లు భావించారు. కావాల్సిన భూమి ఇచ్చారు.  కాగా, భద్రకాళి బండ్‍తో పీఠం ప్రాధాన్యం పెరుగుతుందని భావించాం. కానీ ఆఫీసర్లు బండ్‍కు, పీఠానికి ఉన్న కనెక్టివిటీకి దారి లేకుండా చేశారు. అడ్డుగా పెద్ద గోడ కట్టారు. బొందివాగు నుంచి వచ్చే వరద పోయేలా నాలా ఏర్పాటు చేయలేదు. దీంతో పైనుంచి వచ్చిన వరద గోడకు తాకి వెనక్కి వచ్చి పీఠంతో పాటు మరో ఐదారు కాలనీలు మునగడానికి కారణమైంది.  ఉన్నతాధికారులు కొంత చొరవ చూపితే జానపద గిరిజన విజ్ఞాన పీఠం అభివృద్ధి, ప్రాధాన్యాన్ని పెంచవచ్చు.
గడ్డం వెంకన్న, పీఠాధిపతి